Hyderabad: హైటెక్స్ లో ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ఎగ్జిబిషన్... తెలంగాణలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు... మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
హైదరాబాద్ హైటెక్స్ లో ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు. ఈ ఎగ్జిబిషన్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం స్టాల్స్ ఏర్పాటుచేశారు.
హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటుచేసిన ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ (IITM) ఎగ్జిబిషన్ ను తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ట్రావెల్ మార్ట్ లో ఏర్పాటు చేసిన 15 రాష్ట్రాల టూరిజం స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు. ఆయా రాష్ట్రాలలోని టూరిజం ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం అధికారులను మంత్రి సన్మానించారు. తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని మంత్రి వారిని ఆహ్వానించారు.
Also Read: శిల్పాచౌదరి ట్రాప్ లో పడ్డ యువ హీరో... రూ.3 కోట్లు మోసం చేసిందని ఫిర్యాదు
తెలంగాణకు అంతర్జాతీయంగా గుర్తింపు
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు. గత పాలకులు తెలంగాణలో పర్యాటక ప్రదేశాల పట్ల ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న పర్యాటక, చారిత్రక, వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయానికి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో (UNESCO) వారసత్వ కట్టడాల జాబితా గుర్తింపు లభించిందన్నారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి మరో అనుబంధ సంస్థ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్(UNWTO) భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని బెస్ట్ టూరిజం విల్లేజ్ గా గుర్తించిందన్నారు. ఈ అవార్డు దక్కినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.
Also Read: వరి సాగుకు సర్కార్ నో.. సంక్షోభంలో రైస్ మిల్లులు
టెంపుల్ టూరిజం అభివృద్ధి
తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వందల, వేల ఏళ్ల నాటి చారిత్రక నేపథ్యం ఉన్న పర్యాటక ప్రదేశాలున్నాయన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన వెయ్యి స్థంబాల గుడి, వరంగల్ కోట, చార్మినార్, గోల్కొండ కోట, మన్యం కొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్, నల్లమల్లలోని సోమశిల, అక్కమహదేవి గుహలు, పర్హాబాద్ వ్యూ పాయింట్ లతో పాటు చక్కటి జలపాతాలు, కోటలు, అటవీ, గిరిజన సంస్కృతికి సంప్రదాయాలు, సమ్మక్క సారాలమ్మ జాతర, లక్నవరం, దేశంలోనే మూడవ అతిపెద్ద ముత్యాల దార జలపాతం, కృష్ణ, గోదావరి నదుల మధ్య ఉన్న ప్రకృతి రమణీయ ప్రదేశాలతో పాటు అనేక పర్యాటక ఆకర్షణీయమైన ప్రదేశాలున్నాయన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.1400 కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎమ్.డి మనోహర్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కశ్మీర్, మాల్దీవిస్ టూరిజం, అండమాన్, తో సహా 15 రాష్ట్రాల టూరిజం అధికారులు పాల్గొన్నారు.
Also Read: టిక్కెట్ రేట్లు తగ్గించం, అండగా ఉంటాం.. టాలీవుడ్‌కు తెలంగాణ మంత్రి తలసాని భరోసా !