Mla Rohith Reddy : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్, ఈడీ వేధిస్తుందని హైకోర్టులో రోహిత్ రెడ్డి పిటిషన్
Mla Rohith Reddy : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ ఇబ్బంది పెడుతోందని పిటిషన్ వేశారు.
Mla Rohith Reddy : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. సిట్ దర్యాప్తు రద్దు చేసిన హైకోర్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కేసును ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ విచారణను బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం, ఈడీ, ఈడీ డైరెక్టర్, ఈడీ హైదరాబాద్ జోన్ డైరెక్టర్‌లను ప్రతివాదులుగా చేర్చి రోహిత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనను ఈడీ ఇబ్బంది పెడుతోందని పిటిషన్ లో ఆరోపించారు. ఈడీ ఈసీఐఆర్ కింద కేసు నమోదు చేసిందని ఈ కేసును కొట్టేయాలని కోరారు. మనీలాండరింగ్ కింద నోటీసులిచ్చి తనను వేధిస్తున్నారని, రోహిత్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై స్పందించిన రోహిత్ రెడ్డి.. ఈడీ విచారణపై హైకోర్టులో పిటిషన్ వేశానని స్పష్టం చేశారు. తన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారించనుందని తెలిపారు. ఇవాళ ఈడీ విచారణకు వెళ్లాలా వద్దా అనే విషయంపై తన లాయర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు.
ఈడీ పరిధి దాటి విచారణ
హైకోర్టులో రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ వేశారు. ఈడీ నమోదు చేసిన ECIR 48/2022 పై స్టే ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఈడీ కేసును పూర్తిగా కొట్టివేయాలని అని పిటిషన్ లో హైకోర్టును కోరారు. ప్రతివాదులుగా కేంద్రం,ఈడీ, డిప్యూటీ డైరెక్టర్ ఈడీ, అస్టెంట్ డైరెక్టర్ ను చేర్చారు రోహిత్ రెడ్డి. మనీలాండరింగ్ ఉల్లంఘన లేకుండానే ఈడీ దర్యాప్తు చేస్తుందని పిటిషన్ లో తెలిపారు. ఈడీ పరిధిని దాటి విచారణ జరుపుతోందన్నారు. ఈసీఐఆర్ 48/2022 లో ఎటువంటి చర్యలు తీసుకోకుండా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆర్టికల్ 14, 19, 21 ఉల్లంఘనకు ఈడీ పాల్పడిందని ఆరోపించారు. ఈడీ తదుపరి చర్యలకు పాల్పడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఫామ్ హౌస్ ఎపిసోడ్ లో నమోదైన ఎఫ్ఐఆర్ నుంచి ఈడి నోటీసులు దాకా అన్ని పత్రాలను పిటిషన్ తో జత చేశారు రోహిత్ రెడ్డి. అన్నింటినీ పరిశీలించి ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరారు.
దొంగ స్వాములు ముందే చెప్పారు- రోహిత్ రెడ్డి
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై రోహిత్ రెడ్డి స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన... హైకోర్టు తీర్పు పై తన న్యాయవాదితో మాట్లాడానన్నారు. కోర్టు తీర్పు కాపీ రాలేదని, తీర్పు కాపీ వచ్చాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈడీ, సీబీఐని ప్రయోగిస్తామని ముందే దొంగ స్వాములు చెప్పారన్నారు. వారు చెప్పినట్లే జరుగుతోందన్నారు. ఈడీ విచారణలో ఎలాంటి అంశం దొరకలేదని, దాంతో ఇప్పుడు సీబీఐను రంగంలోకి దింపుతున్నారని ఆరోపించారు. న్యాయ వ్యవస్థపై సంపూర్ణ నమ్మకం ఉందన్న రోహిత్ రెడ్డి... తీర్పు కాపీ వచ్చాక డివిజన్ బెంచ్ కు వెళ్లాలా లేక సుప్రీం కోర్టు కు వెళ్లాలా అనేదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సిట్ ను తప్పించి సీబీఐకి కేసు ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్ అన్నారు. దీనిపై ప్రజలు ఆలోచించాలన్నారు.
కోర్టు ఆర్డర్ తర్వాత కార్యచరణపై ప్రకటన
"ఈ కేసు ఈడీ పరిధిలోకి రాకపోయినా నన్ను ఈడీ విచారణకు పిలిచారు. న్యాయ వ్యవస్థలో ఉన్న సాంకేతిక అంశాలు అడ్డు పెట్టుకుని బీజేపీ నేతలు విచారణకు రావడంలేదు. ఈడీ, సీబీఐ ఏది వచ్చినా మేము సిద్ధం. తప్పు చేయనప్పుడు మాకు భయం అవసరం లేదు. ఈడీ విచారణపై హై కోర్టులో రిట్ పిటిషన్ వేశాను. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం." - రోహిత్ రెడ్డి
సిట్ రద్దు, సీబీఐకి అప్పగింత
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం లతీసుకుంది. సుదీర్ఘ వాదన తర్వాత హైకోర్టు సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మొదట ఏసీబీ కేసును నమోదు చేశారు. తర్వాత హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. కానీ ఈ కేసును ఏసీబీ మాత్రమే విచారించాలని.. సిట్ ఎలా దర్యాప్తు చేస్తుందని ఏసీబీ కోర్టు .. సిట్ దాఖలు చేసిన నివేదికల్ని తిరస్కరించింది. అలాగే ఈ కేసులో కీలక నిందితులు సిట్ దర్యాప్తు కుట్ర పూరితంగా జరుగుతోందని.. విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ను హైకోర్టు రద్దు చేసింది.