Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్
Bandi Sanjay : సీఎం కేసీఆర్ గడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపించారు.
Bandi Sanjay : తెలంగాణకు కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ దేశ ప్రజల పాలిట దేవుడన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ వాడుతున్న భాషను చూస్తుంటే ఆవేదన కలుగుతుందన్నారు. మోదీని ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చినందుకా.. కరోనా వేళ పేదలకు ఉచిత బియ్యం పంచినందుకా? యుద్ధాన్ని ఆపి ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించినందుకా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
మీటింగ్ ఇక్కడే ఎందుకు?
ప్రధాని మోదీ తెలంగాణకు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. వీటితోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలిచ్చిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాతే అభివృద్ధి అంటూ తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తా అని మోదీ అంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదు. జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించే అవకాశం మాకు కల్పించింనందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ. నడ్డాకు ధన్యవాదాలు. జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడే ఎందుకు నిర్వహించారని అడుగుతున్నారు. తెలంగాణ ప్రజలు కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నారని వారికి భరోసా కల్పించేందుకు ఇక్కడే జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. - బండి సంజయ్, బీజేపీ తెలంగాణ చీఫ్
రాష్ట్రం దివాళా తీసింది
టీఆర్ఎస్ సర్కార్ బనాయిస్తున్న అక్రమ కేసులు, రౌడీషీట్ లను ఎదుర్కొని, టీఆర్ఎస్ సర్కార్ పై పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలలో ధైర్యం నింపేందుకు మీటింగ్ ఇక్కడే నిర్వహించారని బండి సంజయ్ అన్నారు. తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ వాటిని దారి మళ్లిస్తున్నారు. నిధులిచ్చే మోదీ నేతృత్వంలోని బీజేపీకే తెలంగాణను పాలించే అర్హత ఉందన్నారు. దేశంలో మరో 20 సంవత్సరాలు మోదీ ప్రభుత్వమే ఉంటుందని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. రాష్ట్రం అప్పులపాలైందని విమర్శించారు. ఒక్కొక్కరిపై లక్షా 20 వేల రూపాయల అప్పు ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. కేసీఆర్ గడీల్లో బంధీ అయిన తెలంగాణ తల్లి విముక్తి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.