Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్
Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారని బండి సంజయ్ విమర్శించారు.
Bandi Sanjay : కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ పై బీజేపీ విమర్శలు సార్ట్ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ కు జెండా, అజెండా లేదన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రారంభించినప్పుడు ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారని, వారిలో ఇప్పుడు ఎంత మంది మిగిలారని ప్రశ్నించారు. కేసీఆర్ ఏ ఉద్దేశంతో జాతీయ పార్టీ పెడుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సొంత పార్టీ నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకోలేదని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే జాతీయ పార్టీ పెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ బండారం బయటపడుతుందనే జాతీయ పార్టీ పెడుతున్నారని బండి సంజయ్ ఆక్షేపించారు.
కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే
టీఆర్ఎస్ పార్టీ విమానం కొనుగోలుపై బండి సంజయ్ విమర్శలు చేశారు. కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్ లో బీఆర్ఎస్ , ప్రజాశాంతి పార్టీ పొత్తు పెట్టుకుంటారేమో అన్నారు. కేటీఆర్ ను సీఎం చేయాలనే కేసీఆర్ జాతీయ పార్టీని తెరపైకి తీసుకొచ్చారన్నారు. మునుగోడు ఉపఎన్నిక నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జాతీయ పార్టీ ప్రకటన చేశారని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ అని పేరు మార్చుకున్నారని మండిపడ్డారు.
సీఎంగా ఉండే అర్హత లేదు
కేసీఆర్‌కు సీఎంగా ఉండే అర్హత లేదని బండి సంజయ్ విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరిస్తారనే నమ్మకం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి కొత్త పార్టీ పేరుతో ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. టీఆర్‌ఎస్ పేరుతో మునుగోడు ఉపఎన్నికలో ఓటు అడిగే అర్హత కేసీఆర్‌కు లేదని ఆక్షేపించారు. జాతీయ పార్టీ నాయకులను టూరిస్ట్ అంటూ విమర్శలు చేసిన కేసీఆర్.. అదే టూరిస్టు మాదిరిగా కేసీఆర్ ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. జాతీయ పార్టీలు ఏం చేస్తాయని ప్రశ్నించిన కేసీఆర్.. ఎందుకు జాతీయ పార్టీ పెట్టారని నిలదీశారు.
ఈటల రాజేందర్ కామెంట్స్
ఇన్ని రోజులు తన తెలంగాణ గడ్డ, తెలంగాణ ప్రజలు అని చెప్పుకునే సీఎం కేసీఆర్ కు రాష్ట్రంతో ఉన్న బంధం తెగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో తెలంగాణకు, ఉద్యమ నేత సీఎం కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందన్నారు. ఉద్యమ పార్టీని ఖతం పట్టించి, ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేశారని కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఉద్యమ చరిత్ర లేకుండా చూసేందుకు, తన ముద్ర ఉండే పార్టీ బీఆర్ఎస్ ని కేసీఆర్ స్థాపించారని విమర్శించారు. జాతీయ పార్టీ బీఆర్ఎస్ స్థాపనతోనే తెలంగాణకి కేసీఆర్ కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందని, రాష్ట్ర ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉండే బంధం తెగిపోయిందన్నారు. రాష్ట్ర సాధనలో పాలు పంచుకున్న తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ చైతన్యానికి కేసీఆర్ కి ఉన్న బంధం తెగిపోయిందని వ్యాఖ్యానించారు.
Also Read : ప్రధాని కావాలన్న ఆశతో ప్రజల్ని కేసీఆర్ వంచిస్తున్నారు: విష్ణు వర్దన్ రెడ్డి
Also Read :Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు