Hydra : హైడ్రా కూల్చివేతలతో నష్టపోతోంది చివరి కొనుగోలుదారులే - అసలు దోషులు సేఫేనా ? బాధితులకు న్యాయం ఎలా ?
Hyderabad : హైడ్రా కూల్చివేతలతో నష్టపోతున్న వారికి ఎలా న్యాయం చేస్తారు ? కబ్జా చేసుకున్న వాళ్లు అమ్మేసి వెళ్లిపోయారు. కానీ కొన్న వాళ్లే నష్టపోతున్నారు. వీరిని అందరూ కలిసి మోసం చేశారు.
Hydra Demolitions : హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలతో ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారు ?. ఈ ప్రశ్నకు సమాధానం.. మధ్యతరగతి ప్రజలే. ప్రభుత్వ స్థలాలు, చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో కడుతున్న కట్టడాలు అన్నీ రాజకీయ నేతలు, వారి బినామీలవే. వారు మాత్రమే అందర్నీ మేనేజ్ చేసి..అన్ని అనుమతులు తీసుకు రాగలరు. సామాన్యులకు సాధ్యం కాదు. కానీ అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి.. వీరిని ఆ రాజకీయ నేతలు, బినామీలు నమ్మించి మొత్తం అంటగట్టేస్తారు. ఎంతగా అంటే లోన్లు ఇప్పిస్తారు. రిజిస్ట్రేషన్లు కూడా చేయిస్తారు. కానీ ఎక్కడో సర్వే నెంబర్ గోల్ మాల్ చేసి.. మొత్తానికి ముంచేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రభుత్వంలో ఉన్న వారు..రాజకీయ నేతలు ముఠాగా ఏర్పడి పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను ఆసరాగా చేసుకుని దోచుకున్నారు. ఇప్పుడు అన్నీ కూల్చేశారు. తప్పు ఎవరిది..? శిక్ష ఎవరికి పడుతుంది ?
కూల్చివేతల సమయంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బాధితుల ఆర్తనాదాలు
కొంత విరామం తర్వాత ఆదివారం కిష్టారెడ్డిపేట. పటేల్ కూడ, కూకట్ పల్లి నల్ల చెరువు ప్రాంతాల్లో కూల్చివేతలు చేసింది. ఆ సమయంలో బాధితుల వేదన వర్ణనాతీతం. ఎందుకంటే.. వాటన్నింటినీ కబ్జా చేసి అమ్ముకున్నవారు అడ్రస్ లేకుండా పోయారు. రూపాయి రూపాయి పోగేసుకుని కొనుక్కున్న వారో.. లీజుకు తీసుకున్నవారో నష్టపోయారు. పటేల్ గూడలో కూల్చిన ఇళ్లకు మూడు రోజుల కిందట రిజిస్ట్రేషన్ చేశారు. ఇవాళ కూల్చేశారు.రిజిస్ట్రేషన్ చేసి మరీ కూల్చడం అంటే.. ప్రభుత్వాన్ని నమ్మిన వారిని వంచించడమే. ఇలాంటి తప్పులు ఎక్కడ జరుగుతాయో.. దానికి కారణం ఎవరో ప్రభుత్వానికి తెలుసు. కానీ బాధితుులుగా చివరి కొనుగోలుదారులే మిగులుతున్నారు. ఆ కూల్చివేతలతో తమ సమస్తం కోల్పోతున్నామని వారు ఎంత ఆవేదన చెందినా ప్రయోజనం ఉండటం లేదు.
ఇంత అన్యాయమా రేవంత్? కోడలు ప్రెగ్నెంట్, ఏడికి పోవాలె - కన్నీళ్లు పెట్టించేలా మహిళ వీడియో
బాధితుల్ని ఆదుకోవాల్సింది ప్రభుత్వమే !
కిష్టారెడ్డిపేటలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. దానికి పట్టాలిచ్చారు. లోన్లు వచ్చేలా చేశారు. కానీ.. అది ప్రభుత్వ భూమి అని అందరకీ తెలుసు. మరి అనుమతులు ఎలా ఇచ్చారు. రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి?. అంతా చేసేసి కొనుగోలు దారులకు నష్టం జరిగేలా కూల్చివేయడం అంటే ద్రోహం చేస్తున్నట్లే లెక్క. ఇరప్పుడు ప్రభుత్వం ఆ భూముల్ని కబ్జా చేసి అమ్ముకున్న వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి... చివరి కొనుగోలుదారులకు ఇవ్వాలి. వారికి నష్టం జరగకూండా చూడాలన్న భావన ఏర్పడుతోంది. ఎందుకంటే ఈ పాపంలో ప్రభుత్వానికీ భాగం ఉంది. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో భాగమే . వారు తప్పు చేస్తే ప్రభుత్వం తప్పు చేసినట్లే. ఆ తప్పులకు ప్రజల్ని బాధ్యుుల్ని చేయలేరు. అందుకే.. ఇలా ఇళ్లు నష్టపోతున్న ప్రతి ఒక్కరికీ వారి సొమ్ము వారికి వెనక్కి ఇచ్చే ఏర్పాట్లు చేయాలి. అలా చేస్తేనే మరోసారి కబ్జా చేసి అమ్ముకునేవాళ్లు కూడా ఆలోచిస్తారు. మరోసారి ఎప్పడైనా కట్టాల్సి వస్తుందని కంగారు పడతారు.
కూకట్‌పల్లిలో హైడ్రా కొరడా! ఆ చెరువు చుట్టూ నిర్మాణాల కూల్చివేత
ప్రభుత్వానిది కూాడా తప్పేనన్న భావన
ఓ ప్రభుత్వ భూమిలో అపార్టుమెంట్లు కట్టే వరకూ వ్యవస్థలు ఏమి చేస్తాయి.. ఆ ఆపార్టుమెంట్లకు హోమ్ లోన్లు వచ్చేలా డాక్యుమెంట్లు రెడీ అయ్యేదాకా ఏమి చేస్తారు ?. ఇలా చేయడం అంటే.. ఖచ్చితంగా ప్రభుత్వ లోపం ఉన్నట్లే. దానికి ప్రజల్ని శిక్షించలేరన్నది ఎక్కువ మంది చెప్పేమాట . హైడ్రాకు సూపర్ వపర్లు ఇచ్చిన ప్రభుత్వం.. కూల్చి వేతలకు.. కేసులకే కాదు.. నష్టపోతున్న మధ్యతరగతి ప్రజలకు.. అధికారుల మోసాలకు బలైపోయిన పేదలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజావిశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయే ప్రమాదం ఉంటుంది.