Hyderabad News: ఇంత అన్యాయమా రేవంత్? కోడలు ప్రెగ్నెంట్, ఏడికి పోవాలె - కన్నీళ్లు పెట్టించేలా మహిళ వీడియో
Telangana News: హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు జరిగాయి. కూకట్ పల్లిలోని నల్ల చెరువు, అమీన్ పూర్ లాంటి ప్రాంతాల్లో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధుల్లో ఉన్న తాతాల్కిక నిర్మాణాలను కూల్చేశారు.
HYDRA Victims News: ‘‘ఇంత అన్యాయమా రేవంత్ రెడ్డి? మీరు వస్తే బాగుంటుంది నేను కూడా మీకు ఓటేసిన. కానీ ఇట్లా చేస్తావ్ అనుకోలే.. మా సామాన్లు తీసుకునే వరకు సమయం ఇవ్వండి అని అడిగినా వినట్లేదు. కనీసం రెండు నెలలు టైం ఇవ్వాలని అడిగినం. మేం ఇక్కడ అద్దెకు ఉంటున్నం. మాకు కనీసం టైం ఇయ్యాలె కదా.. నా కొడుకుకు ఏమీ తెల్వక ఇక్కడ ఉంటున్నం. నా కోడలు నీళ్లు పోసుకున్నది. ఇప్పటికి ఇప్పుడు మేం ఏడికి పోవాలె’’ అంటూ ఓ మహిళ కన్నీరుమున్నీరుగా విలపించింది. హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చేస్తుండగా ఓ బాధిత మహిళ కన్నీరు పెట్టుకుంటూ మీడియాకు చెబుతుండడం అందర్నీ కలచివేసింది.
హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి ప్రభుత్వ నియమించిన హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection Agency) చెరువులను కాపాడే ఉద్దేశంతో అక్రమ కట్టడాల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వీఐపీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఈ క్రమంలోనే హైడ్రా అధికారులు కూకట్‌పల్లి, అమీన్ పూర్ ప్రాంతాల్లో మొత్తం మూడు చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. అయితే, తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోని విలువైన వస్తువులను కూడా బయటకు తీసుకెళ్లనివ్వకుండా అధికారులు కూల్చివేస్తున్నారంటూ పలువురు బాధిత నివాసితులు రోదిస్తున్నారు. కూల్చివేతల వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
కూకట్‌పల్లి శాంతి నగర్‌లో బాధితులు విపరీతంగా రోదించారు. అయితే, ఈ ప్రాంతంలో 20కి పైగా కమర్షియల్ షటర్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. కూకట్ పల్లిలోని నల్ల చెరువును ఆక్రమించి పలువురు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టగా.. వాటిని కూడా అధికారులు కూల్చివేశారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. కనీసం సామాన్లు కూడా తీసుకొనివ్వలేదని ఆవేదన చెందుతున్నారు. రూ.50 లక్షలు పెట్టి ఫుడ్ క్యాటరింగ్ స్టాల్‌ను కట్టుకున్నానని ఓ బాధితుడు విలపిస్తూ చెప్పాడు.
మమ్మల్ని చంపేయండి
మేం కట్టుకున్న నిర్మాణాలు కూల్చేసే ముందు మమ్మల్ని చంపేయండి అంటూ పలువురు బాధితులు ఏడవడం అందర్నీ కలచివేసింది. తమ విలువైన సామాన్లు కూడా బయటకి తీసుకోనివ్వకుండా హైడ్రా అధికారులు వ్యవహరిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, పేదల పట్ల హైడ్రా చాలా కర్కశంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. కనీసం నోటీసులు ఇచ్చి, కాస్త సమయం ఇచ్చి కూల్చాలని చెబుతున్నారు. కనీసం కనికరం లేకుండా హైడ్రా అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు జనం చేస్తున్నారు.
స్పందించని కమిషనర్
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని పటేల్ గూడ గ్రామంలో హైడ్రా కూర్చోవేతలు కొనసాగిస్తుంది. రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా అధికారులు భవనాలను కూల్చేస్తున్నారు. భవనాల్లో ఉన్న ఇంటి సామాగ్రిని ప్రజలను బయటికి పంపించి మరీ కూల్చివేతలను అధికారులు కొనసాగిస్తున్నారు. హైడ్రా అధికారుల తీరును ప్రజలు, భవన యజమానులు తప్పుపడుతున్నారు. ఇళ్లలో ఉన్న వారిని బయటికి పంపించకుండా తర్వాత నోటీసులు ఇస్తామని చెప్పిన హైడ్రా.. నిర్దాక్షిణ్యంగా బయటికి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలో ప్రజలను వారి సామాన్లు బయటికి పంపిస్తున్న అంశంపై ఇంత వరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎలాంటి స్పందన తెలపలేదు.