Mahabubabad News: గుర్తు తెలియని శవం అని మార్చురీలో పడేశారు - కానీ బతికే ఉన్నాడు - మహబూబాబాద్ ఆస్పత్రి నిర్వాకం
Mahabubabad: మహబూబాబాద్ లో చనిపోయాడని బతికున్న వ్యక్తిని మార్చురీలో పడేశారు ఆస్పత్రి సిబ్బంది. ఈ ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ విచారణకు ఆదేశించారు.

Mahabubabad Hospital Morgue Live Man: తెలంగాణలోని మహబూబాబాద్ జనరల్ హాస్పిటల్‌లో జరిగిన షాకింగ్ ఘటన సంచలనంగా మారింది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఒక వ్యక్తిని 'మరణించాడని' చెప్పి మార్చురీలో పడేశారు. గుర్తు తెలియని శవం అని రాసుకున్నారు. ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తక్షణమే ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, వేర్వేరు మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ, ఘటన పూర్వపరాలు, హాస్పిటల్ సిబ్బంది వైఖరి, వైద్య నిర్లక్ష్యం విషయాల్లో విచారణ చేసి, త్వరలో నివేదిక సమర్పించనుంది.*
ఆధార్ కార్డు లేకపోవడంతో చికిత్స చేయని వైద్యులు
ఎల్డి రాజు అనే వ్యక్తి మహబూబాద్ జిల్లా చిన్నగూడూర్ మండలం జయ్యారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్. కాలు నొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు ఆధార్ కార్డు లేదు, భార్య కూడా వదిలేసి వెళ్లిపోయింది. ఆరు రోజుల క్రితం మహబూబాద్ జనరల్ హాస్పిటల్‌కు చేరుకున్న రాజు చికిత్స కోసం ప్రయత్నించారు. ఆధార్ కార్డు లేకపోవడంతో చికిత్స అందించకపోవడంతో హాస్పిటల్ క్యాంటీన్ సమీపంలోనే ఉంటున్నారు.
అక్టోబర్ 30 సాయంత్రం, హాస్పిటల్ మార్చురీ భవనం సమీపంలో కూర్చుని ఉన్న రాజు ఒక్క సారిగా పడిపోయారు. ఎంత ప్రయత్నించినా కదలిక లేకపోవడంతో సెక్యూరిటీ గార్డ్, ఆయన మరణించారని అని గుర్తు తెలియని శవంగా భావించి స్ట్రెచర్‌పై పెట్టి మార్చురీ వరండాలో ఉంచాడు. పల్స్ చెక్ చేయకుండానే, సిబ్బంది మార్చురీలో రాజు శరీరాన్ని ఉంచి లాక్ చేసి వెళ్లిపోయారు. రాజు ఆ రాత్రి మొత్తం మార్చురీలోనే గడిపారు. అక్టోబర్ 31 ఉదయం, మార్చురీలో శుభ్రపరచడానికి వచ్చిన స్వీపర్లు ఆయన శరీరం కదులుతున్నట్టు చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సబ్-ఇన్‌స్పెక్టర్ స్థలానికి చేరుకుని, రాజును ఎమర్జెన్సీ వార్డుకు మార్చారు.
హాస్పిటల్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి. జగదీశ్వర్ ఆస్పత్రిలో రోజుకు 1,200 మంది పేషెంట్లకు చికిత్స అందిస్తున్నామని.. ఆధార్ లేకపోయినా, అటెండెంట్ లేకపోయినా చికిత్స చేస్తామని చెప్పారు. ఘటనపై ఇంటర్నల్ ఎంక్వైరీ ప్రారంభించారు. అయితే సిబ్బంది మాత్రం బతికిని వ్యక్తిని మార్చురీలో ఉంచలేదని.. కదల్లేని స్థితిలో ఉంటే.. స్ట్రెచర్ పై ఉంచి.. మార్చురీ ప్రాంగణంలో ఉంచామని చెప్పుకొచ్చారు.
ఈ ఘటనపై తెలిసిన వెంటనే మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్రంగా స్పందించారు. ఆధార్ కార్డు లేకపోతే చికిత్స ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్‌కు విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చారు. డైరెక్టర్, హైదరాబాద్‌లోని వేర్వేరు మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ, ఘటన రోజు నుంచి పూర్వపరాలు, సిబ్బంది వైఖరి, వైద్య ప్రొటోకాల్స్ పాటించకపోవడం విషయాల్లో విచారణ చేసి, ఒక వారంలో నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు. బాధితుడు రాజుకు అవసరమైన చికిత్స ఉచితంగా అందించాలన్నారు.





















