Weather Report: భానుడి ఉగ్రరూపం - వర్షాలపై కీలక అప్ డేట్, తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి!
Telangana News: భానుడి ఉగ్రరూపంతో ప్రజలు అల్లాడుతున్న వేళ వాతావరణ శాఖ కాస్త కూల్ న్యూస్ చెప్పింది. ఈ నెల 6న తెలంగాణలో కొన్ని జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
Imd Rain Update In Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచే వేడిగాలులు, ఉష్ణోగ్రతలు మొదలవుతున్నాయి. పగటి పూట బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం అత్యధికంగా నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడపూర్ లో 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అయితే, రాబోయే రోజుల్లో ఇది 47 డిగ్రీల మార్క్ దాటే ఛాన్స్ ఉందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. గురువారం నుంచి శనివారం వరకూ వడగాలుల తీవ్రత ఉంటుందని హెచ్చరించారు. చాలా చోట్ల 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- గురువారం జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
- అలాగే, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
- మే 3వ తేదీన (శుక్రవారం) కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
- మే 4వ తేదీన (శనివారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో కొన్ని చోట్ల తీవ్ర వడగాల్పులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
- అలాగే, ఖమ్మం, నల్గొండ, ములుగు, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
భాగ్యనగరంలోనూ
అటు, భాగ్యనగరంలోనూ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతున్నాయి. గాలిలో తేమ 20 శాతం కంటే తక్కువ పడిపోవడంతో వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. బుధవారం హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు 29.9 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి.
ఈ జిల్లాలకు వర్ష సూచన
ఎండలు మండుతున్న వేళ కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ అందించింది. ఈ నెల 6 నుంచి రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ నెల 6వ తేదీన (సోమవారం) కరీంనగర్, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలో ఇదీ పరిస్థితి
ఏపీలోనూ భానుడి ఉగ్రరూపం చూపిస్తున్నాడు. దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. దక్షిణ కోస్తాలో శనివారం ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రాయలసీమలో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అన్నారు.
తిరుపతిలో భారీ వర్షం
మరోవైపు, తిరుపతిలో గురువారం వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి వాతావరణం కొంచెం చల్లగా ఉండగా.. భారీ వర్షం పడింది. తిరుమల శ్రీవారి ఆలయం, నాలుగు మాడ వీధులు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉక్కబోతతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. అటు, ఈదురుగాలులతో వర్షం కురుస్తున్నందున పంటలకు నష్టం కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: Warangal News: కడియం శ్రీహరి కుల వివాదమేంటి? కుమార్తె పెళ్లి ఇంకా పెద్ద రచ్చ ఎందుకు?