Nirmal Rains: తెలంగాణలో మస్తు వానలు.. నీట మునిగిన నిర్మల్!
తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. నిర్మల్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నిర్మల్ జిల్లాలో కుండపోత వర్షం కారణంగా.. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ కారణంగా అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నిర్మల్ జిల్లాలోని దిలావపూర్ మండలంలో 24.7సెంటీమీటర్ల వర్షం పడింది. 99చోట్ల 7నుంచి 20సెంటీమీటర్ల కుండపోత వర్షం పడింది. స్వర్ణ, కడెం, భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు గేట్లు ఒక్కసారిగా తీయడంతో భైంసా ఆటోనగర్‌లోని ఇళ్లను వరద నీరు చుట్టేసింది. ఆటోనగర్, ఎన్.ఆర్.గార్డెన్ ప్రాంతాల్లో పూర్తిగా నీరు చేరుకుంది. వరద నీటిలో చిక్కుకున్న దాదాపు 150 మందిని అగ్నిమాపక సిబ్బంది, గజఈతగాళ్లు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఎన్.ఆర్.గార్డెన్‌లో బస చేసిన 20 మంది పోలీసులు వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని బోట్ల సాయంతో గజఈతగాళ్లు రక్షించారు. గేట్లు వదిలేయడం కారణంగా.. నీరు పెద్ద ఎత్తున రావడంతో ఆటోనగర్, ఎన్.ఆర్.గార్డెన్ ప్రాంతాల్లో దాదాపు 60 కుటుంబాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి.
స్వర్ణ జలాశయం ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలడంతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. స్వర్ణ వాగుకు సమీపంలో గల జిల్లా కేంద్రంలోని సిద్ధాపూర్‌లోని జీఎన్ఆర్ కాలనీలోకి వరద నీరు వచ్చి చేరడంతో నీట మినిగింది. కాలనీలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని కాపాడంటూ.. వేడుకుంటున్నారు.
నిర్మల్ చరిత్రలో ఇలాంటి వర్షాలు ఎప్పుడూ కురవలేదని స్థానికులు చెబుతున్నారు. నిత్యావసరాలు, తాగు నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల చుట్టూ వరద నీరు చట్టుముట్టిందని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.
నిర్మల్ జిల్లాలో వరద పరిస్థితులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీఎం కేసీఆర్ కు వివరించారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగారు. సహాయక చర్యలపై కేసీఆర్ ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిర్మల్‌కు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపుతున్నామన్నారు. ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం చెప్పారు.
అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. జోరు వానలో పలు కాలనీల్లో పర్యటిస్తూ.. అధికారులకు సూచనలు చేశారు.
Guys please help us NIRMAL (GNR colony ) plz we r dying here plz hep us plz @KTRTRS @trspartyonline @trsharish @musharraf_ias @IKReddyAllola plz help us sir pic.twitter.com/TvytVWDhYt
— Santosh Shetty (@santoshbanu21) July 22, 2021
Also Read: Rains: తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు.. మరో రెండ్రోజులుంటాయట జాగ్రత్త!