Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు - జాగ్రత్తగా ఉండాలంటున్న అధికారులు
Heavy Rains: మరో మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
Heavy Rains: దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రా సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ముసురు వాతావరణంతోనే ఏపీ, తెలంగాణ రెండు మూడు రోజులు ఉండబోతున్నాయని స్పష్టం చేసింది. తెలంగాణలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది. మంగళవారం రోజు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 24, 2023
అలాగే బుధవారం నుంచి మూడు రోజుల పాటు కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం ఉదయం నుంచి విజయ నగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ స్థాయిలో వర్షం పడింది. అత్యధికంగా విజయనగరం జిల్లా కొత్త వలసలో 113.75 మి.మీ, విశాపట్నం గ్రామీణంలో 106 మి.మీ వర్షం కురిసింది. విశాఖ నగరంలోనూ ఆదివారం రోజు పెద్ద ఎత్తున వర్షం కురిసింది. బీచ్ రోడ్డులో సాగర్ నగర్ - రాడిసన్ బ్లూ రిసార్ట్ మధ్య రోడ్డంతా చెరువులా మారిపోయింది. రహదారి మొత్తం జలమయం అయ్యే సరికి వాహన దారులు తీవ్ర అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వర్ష ప్రభావంతో సాగర్ నగర్ వద్ద కల్వర్టు రక్షణ గోడ కూలింది. మధురవాడ వద్ద సర్వీలు మార్గాలు కూడా వాన నీటితో చెరువులును తలపించాయి. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయ నగరం, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు.
గోదావరి పరివాహక రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు
ఐఎండీ అంచనాల ప్రకారం ఎగువ ఉన్న గోదావరి పరివాహక రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. శనివారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 41.4 అడుగులు ఉందన్నారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.41 లక్షల క్యూసెక్కులు ఉందని తెలిపారు. ఆదివారం నుంచి ధవళేశ్వరం వద్ద వరద పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాటన్ బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక వరకు వరద చేరే అవకాశం ఉన్నందని అన్నారు. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామన్నారు.