Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ సోమవారం విచారణ జరిపింది.
Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ సోమవారం విచారణ జరిపింది. ఈ కేసులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఫిర్యాదుదారుడు రాఘవేందర్ రాజుకు మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రిని కేసు నుంచి ఉద్దేశ పూర్వకంగానే తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఆయన పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది.
శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలు ప్రకటించలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయిదే రాఘవేంద్రరాజు పిటిషన్‌ను తిరస్కరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంత్రి అభ్యంతరాలు పరిశీలించాలని ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ పిటిషన్‌ను కొట్టివేసింది.
2018 ఎన్నికల టైంలో నామినేషన్ తో పాటు అఫిడవిట్ ను శ్రీనివాస్ గౌడ్ సమర్పించారు. అయితే ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన అఫిడవిట్ స్థానంలో మరో అఫిడవిట్ అప్లోడ్ చేశారని ఆయన ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో రాఘవేంద్రరాజు కేంద్రఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎన్నికల సంఘం కూడా విచారణ జరుపుతోంది. వరుసగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలవుతుండంతో రాష్ట్రంలో ఏంజరుగుతోందనే ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
గతంలో ఎమ్మెల్యే వనమాపై హైకోర్టు అనర్హత వేటు
ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం సమర్పించారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హత వేటు చేసింది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది. అంతేకాదు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించింది. 2018 వనమా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. ఎన్నికల సమయంలో వనమా తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని 2019 జనవరి నుంచి జలగం వెంకట్రావు న్యాయపోరాటం చేస్తున్నారు. వనమాపై వచ్చిన ఆరోపణలు నిజమేనని రుజువు కావడంతో సమీప ప్రత్యర్థిని హైకోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది. దీనిపై ఎమ్మెల్యే వనమా సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తీసుకుకొచ్చుకున్నారు.
వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ మారినందున రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని జలగం తరఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు కోరారు. దీనిపై హైకోర్టులో వాదనలు జరగలేదు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. వనమా విచారణకు హాజరుకాకపోవడం, ఆయా ఎన్నికల్లో సమర్పించిన ప్రమాణపత్రాల వివరాలు, ఒక భార్య ఉన్నారా లేదా ఇద్దరు భార్యలు ఉన్నారా తదితర అంశాలన్నీ పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.