Governor Tamilisai: మాకు హక్కుంది, మేం కూడా రాజకీయాలు మాట్లాడతాం: గవర్నర్ తమిళిసై
Telangana Governor Tamilisai: రాజకీయ చర్చల్లో పాల్గొనడానికి పార్టీల నేతలకు ఎంత హక్కు ఉందో, గవర్నర్‌లకు అంతే హక్కు ఉందన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై.
![Governor Tamilisai: మాకు హక్కుంది, మేం కూడా రాజకీయాలు మాట్లాడతాం: గవర్నర్ తమిళిసై Governors also have Right to talk about Politics, Telangana Governor Tamilisai Governor Tamilisai: మాకు హక్కుంది, మేం కూడా రాజకీయాలు మాట్లాడతాం: గవర్నర్ తమిళిసై](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/09/4a4aaaee642e71c86e3f4f0c0f84145b1688903836870233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana Governor Tamilisai: గవర్నర్లు రాజకీయాలపై మాట్లాడకూడదని, కామెంట్లు చేయకూడదని కొందరు రాజకీయ నాయకులు తరచుగా అంటుంటారు. అయితే ఈ విషయంపై తెలంగాణ గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఘాటుగా స్పందించారు. రాజకీయాలు మాట్లాడే హక్కు గవర్నర్లకు కూడా ఉందన్నారు. రాజకీయ చర్చల్లో పాల్గొనడానికి పార్టీల నేతలకు ఎంత హక్కు ఉందో, గవర్నర్‌లకు అంతే హక్కు ఉందన్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై ఇటీవల మాట్లాడుతూ.. గవర్నర్లు రాజకీయాల గురించి చర్చించడం మానుకోవాలన్న వ్యాఖ్యలకు తమిళిసై కౌంటర్ ఇచ్చారు.
కోయంబత్తూర్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ అంశాలపై మాట్లాడే హక్కు గవర్నర్ లకు ఉందన్నారు. తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు నేతలకు ఉన్నట్లే గవర్నర్లకు ఉందని స్పష్టం చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి రాజకీయాలు చేస్తున్నారని, మంత్రులు, ప్రభుత్వంపై మాట్లాడటం సరికాదన్నారు అన్నామలై. గవర్నర్లు రాజకీయాలు చేయకూడదని, వారు రాజకీయ అంశాలకు దూరంగా ఉండాలనే తరహాలో అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లు మీడియాకు దూరంగా ఉండాలని, తరచుగా మీడియాతో మాట్లాడకూడదని అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపాయి.
తెలంగాణలో సైతం గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసైని ప్రభుత్వం ఆహ్వానించలేదు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సైతం పిలుపు రాలేదని గవర్నర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా ఓ సెషన్ జరిపించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించారు. ఆ సమయంలోనూ గవర్నర్ తమిళిసై ఘాటుగా స్పందించారు. ప్రధాని చేతుల మీదుగా కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన పార్లమెంట్ ప్రారంభిస్తే బావుండేదని బీఆర్ఎస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు గగ్గోలుపెట్టాయి. ఈ విషయంపై తమిళిసై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి చురకలు అంటించారు. రాష్ట్రపతిల మాదిరిగానే గవర్నర్లు కూడా రాజకీయేతర వ్యక్తులే కదా అంటూ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన వేడుకలు, ప్రారంభోత్సవాలకు తనను ఆహ్వానించకపోవడంపై ఇలా వ్యాఖ్యానించారు. సచివాలయ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గుర్తు చేశారు. తనకు కనీసం ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదని తమిళిసై ప్రస్తావించడం తెలిసిందే.
నాపై విమర్శలు కాదు, కొత్త భవనం కట్టండి - గవర్నర్ తమిళిసై
జులై 3న ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి విషయంలో చొరవ చూపిన కోర్టును అభినందిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఆసుపత్రిలోని టాయిలెట్లు పరిశీలించానని చాలా అపరిశుభ్రంగా ఉన్నాయని అన్నారు. ఉస్మానియాకు రోజుకు 2 వేల మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారని, ఆసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడి రోగులు బాధపడుతున్నారని అన్నారు. ఈ ఆస్పత్రిలో దాదాపు రోజుకు 200 దాకా ఆపరేషన్లు జరుగుతున్నాయని అన్నారు. వందల ఏళ్లనాటి భవనం కాబట్టి, కొన్ని చోట్ల పెచ్చులు ఊడుతున్నాయని అన్నారు. జనరల్ వార్డులో కొన్ని ఫ్యాన్లు మాత్రమే పనిచేస్తున్నాయని, ఎండ వేడి తట్టుకోలేకపోతున్నామని రోగులు చెబుతున్నారని గుర్తు చేశారు. తాను ఎవరినీ తప్పుబట్టేందుకు ఉస్మానియా ఆసుపత్రికి రాలేదని, రాజకీయ కోణంలో అస్సలు రాలేదని తమిళిసై అన్నారు. తనపై విమర్శలు చేయడంలో పెట్టే శ్రద్ధ కొత్త భవనం కట్టడంలో ఉండాలని కోరారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)