Telangana Finance Commission Funds: జరగని ఎన్నికలు - పంచాయతీలకు అందని నిధులు - పల్లెలపై ప్రభుత్వానికి కనికరం ఎప్పుడు ?
Telangna villages: పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. మార్చిలోపు నిర్వహించకపోతే రూ. మూడు వేల కోట్లు మురిగిపోయినట్లే.

Finance Commission funds for Telangna villages stopped: తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కారణాలతో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతూండటంతో ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. ఇప్పటికే గ్రామాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల రాష్ట్ర పంచాయతీ రాజ్ సంస్థలకు రూ.3,000 కోట్లకు పైగా కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు 'ల్యాప్స్' అయ్యే ప్రమాదంలో పడ్డాయి. 2021-26 కాలానికి 15వ ఫైనాన్స్ కమిషన్ కేటాయించిన చేసిన రూ.7,201 కోట్లలో భాగంగా, 2024-25కి రూ.1,514 కోట్లు ఇప్పటికే 'ఫ్రీజ్' అయ్యాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.
ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గాలు ఉంటేనే నిధులు
ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గాలు ఉన్న పంచాయతీలకే నిధులు జమ చేస్తారు. ప్రస్తుతం పంచాయతీల కాలపరిమితి ముగిసి ఏడాదిన్నర దాటిపోయింది. స్పెషలాఫీసర్ల పాలనలోనే ఉన్నాయి. నిధుల సమస్య ఉండటంతో గ్రామీణ అభివృద్ధి ప్రణాళికలు, శానిటేషన్, రోడ్లు, ఇతర పనులన్నీ పెండింగ్‌లో పడ్డాయి. బీసీ రిజర్వేషన్ల సుడిగండంలో స్థానిక ఎన్నికలు చిక్కుకోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. చివరికి పాత రిజర్వేషన్లతోనే డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏ కారణం చేతనైనా.. ఎన్నికలు నిర్వహించలేకపోతే.. రూ. మూడు వేల కోట్లు ల్యాప్స్ అయిపోతాయి.
ఎన్నికలు జరగకపోవడంతో ఆగిపోయిన నిధులు
ఫైనాన్స్ కమిషన్ నిధులు 'ఎలక్టెడ్ బాడీలు' ఉండాలని కండిషన్. దీంతో, రూ.1,000 కోట్లు ఫ్రీజ్ అయ్యాయి. ఫిబ్రవరి 2025లో మరో రూ.1,500 కోట్లు 'హోల్డ్' అయ్యాయి. ఆగస్టు 2025లో మరో రూ.3,000 కోట్లు 'రిస్క్'లో పడ్డాయి. పంచాయతీ సెక్రటరీలు తమ జేబులోంచి బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేస్తూ, స్ట్రీట్ లైట్లు రిపేర్ చేస్తున్నారు. మునుపటి సర్పంచెస్‌లకు రూ.700 కోట్లు పెండింగ్ బిల్లులు, సెక్రటరీలకు రూ.383 కోట్లు – మొత్తం రూ.1,083 కోట్లు పెండింగ్ ఉన్నాయి.
రిజర్వేషన్ చిక్కులతో ఎన్నికలు ఆలస్యం
రాష్ట్రంలో 12,769 పంచాయతీలు 'స్పెషల్ ఆఫీసర్ల' పాలనలో ఉన్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో సుప్రీంకోర్టు ఆదేశాలతో 28 శాతానికే రిజర్వేషన్లు పరిమితం చేసి ఎన్నికలు నిర్వహించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, 42 శాతం బీసీ కోటా ప్రకటించింది. జీవోలు, ఆర్డినెన్స్ విడుదల చేశారు. కానీ అవేమీ న్యాయపరిశీలనలో నిలబడటం లేదుదు. మార్చి 2026కల్లా ఎన్నికలు జరిగకపోతే, 2025-26కి అలాట్ చేసిన రూ.3,000 కోట్లు ల్యాప్స్ అవుతాయని క్యాబినెట్ తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. పాత రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీలు, మున్సిపాలిటీలు 'పోస్ట్‌పోన్' చేస్తామని చెబుతున్నారు.
ఎన్నికలు జరగకపోతే రాజకీయంగానూ ప్రభుత్వానికి నష్టం
ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో గెలుపు ఊపులో ఎన్నికలు నిర్వహించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి కూడా రాజకీయంగా లాభం కలిగి ఉండేది. కానీ బీసీ రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని పట్టుదలకు పోవడం వల్ల ఎన్నికలు ఆలస్యమవుతూ వస్తున్నాయి. గత ఏడాది నుంచి వచ్చే నెలే ఎన్నికలు అనే ప్రకటనలు కామన్ అయ్యాయి. డిసెంబర్ లో అయినా పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించలేకపోతే.. పంచాయతీలు తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఇరుక్కుపోతాయి. అంటే ప్రజలు ఇబ్బంది పడతారు. ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుంది.





















