Chandra Shekhar Congress: కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి చంద్రశేఖర్, ఇక బీజేపీ పని అయిపోయినట్టేనని వ్యాఖ్యలు
రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని, బీఆర్ఎస్ ను బీజేపీనే కాపాడుతోందని చంద్రశేఖర్ అన్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం అని అన్నారు.
తెలంగాణ బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈయన మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. 2021లో బీజేపీలో చేరిన ఆయన తనకు అక్కడ ప్రాధాన్యం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని, బీఆర్ఎస్ ను బీజేపీనే కాపాడుతోందని అన్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం అని అన్నారు.
తెలంగాణలో బీజేపీని ఓ స్థాయికి తీసుకురావడానికి బండి సంజయ్ చాలా పని చేశారని, కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా పని చేశారని చంద్రశేఖర్ గుర్తు చేశారు. అలాంటి బండి సంజయ్‌కు అధ్యక్ష పదవి నుంచి తప్పించి తప్పు చేశారని అన్నారు. దీంతో ఇక బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని గ్రామస్థాయిలో కూడా చర్చ జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ మూడో స్థానానికి వెళ్లిపోయిందని అన్నారు. బండి సంజయ్ కు జాతీయ కార్యదర్శి పదవి ఇచ్చాక ఆయన సంతృప్తిగా ఉన్నారో లేదో ప్రశ్నించుకోవాలని అన్నారు. బండి సంజయ్ లా కష్టపడే నాయకులకి బీజేపీలో చోటు లేదని అన్నారు.
ఈటల బుజ్జగింపులు అయినా..
చంద్రశేఖర్ ను ఈటల రాజేందర్ బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన మనసు మార్చుకోలేదు. బీజేపీ నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న చంద్రశేఖర్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. వికారాబాద్‌లో 2021 జనవరి 18న నిర్వహించిన బహిరంగ సభలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ సమక్షంలో చంద్రశేఖర్ బీజేపీలో చేరారు.
చంద్రశేఖర్‌కు సముచిత స్థానం కల్పిస్తామని అప్పట్లో ముఖ్య నేతల హామీ ఇచ్చారు. అయితే తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తన తరువాత పార్టీలో చేరిన వారిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలిసింది.పార్టీలో ప్రాధాన్యం ఉండేలా బాధ్యతలు అప్పగిస్తామని గతంలో బండి సంజయ్ హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయనే పదవిలో లేకపోవడంతో చంద్రశేఖర్ ఆశలు సన్నగిల్లాయి.
గతంలో చంద్రశేఖర్ టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేశారు. 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుంచి అసెంబ్లీకి, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరినా అక్కడ ఇమడలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఇక నేను ఉండలేనంటూ తాజాగా పార్టీని వీడి బయటకు వచ్చేశారు.