Errabelli Dayakar Rao: బ్రోకర్ దందాలు చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి - టీపీసీసీ చీఫ్ పై మంత్రి ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు
Errabelli Dayakar Rao: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన జనగామలో మీడియాతో మాట్లాడారు.
Errabelli Dayakar Rao: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన జనగామలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల విషయంలో గందరగోళం ఉందన్నారు. రేవంత్ రెడ్డి డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నారని, మూటలు ఇచ్చిన వారికే సీట్లు కేటాయిస్తున్నరని ఆరోపించారు. మొదటి నుంచి రేవంత్ రెడ్డి గుణం అదే అన్నారు. చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. బ్రోకర్ దందాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్యపై రేవంత్ రెడ్డి నీచమైన వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. పొన్నాలను బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
పైసలకు అమ్ముడుపోయే వ్యక్తి రేవంత్ రెడ్డి
కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న సీనియర్ నేతలను రేవంత్ రెడ్డి బయటికి పంపిస్తున్నారని విమర్శించారు. పైసలకు అమ్ముడుపోయి సంవత్సరానికో పార్టీ మారే వ్యక్తి రేవంత్ రెడ్డి అని దయాకర్ రావు అన్నారు. పైసలకు అమ్ముడు పోయే వ్యక్తి రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడి చేశారో అప్పుడే కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిందని ఎద్దేవా చేశారు. ఉన్నత విద్య చదువుకుని ఒక కంపెనీకి సీఈఓగా చేసిన కేటీఆర్‌పైన రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం హాస్యాస్పదం అన్నారు. కేటీఆర్‌కు గొప్ప వ్యక్తి అని, రేవంత్ లా బూతులు మాట్లాడే వ్యక్తి కాదన్నారు. కేటీఆర్ రాష్ట్ర మంత్రిగా చేశారని, ఎమ్మెల్యేగా పనిచేశారని అన్నారు. బిమ్మిని తమ్మి, తమ్మిని బిమ్మి చేసే కారెక్టర్ రేవంత్ రెడ్డిదని, గోడల మీద పెయింటింగ్ రాసుకునే వ్యక్తి అంటూ మండిపడ్డారు.
దమ్ముంటే రంగారెడ్డి జిల్లా నుంచి పోటీ చేయాలి
కొండగల్ ప్రజలు చిత్తు చిత్తుగా రేవంత్ రెడ్డిని ఓడించారని, అక్కడి ప్రజలు తరమికొడితే పారిపోయి మల్కాజ్ గిరి నుంచి పోటీచేశారని అన్నారు. ఇక్కడ మాయమాటలు చెప్పి గెలిచారని విమర్శించారు. దమ్ముంటే రంగారెడ్డి జిల్లా నుంచి పోటీ చేస్తే రేవంత్ రెడ్డి దమ్ము ఏంటో తెలుస్తుందన్నారు. ఐదేళ్లకోసారి సీటు మారే వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాశనం అవడానికి రేవంత్ రెడ్డి ఒక్కరు చాలన్నారు. అమ్మడం, కొనడం ఆయనకు అలవాటని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు విలువ లేదని, కావాలనే బయటకు పంపేస్తున్నారని ఆరోపించారు.
రేపు బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో
ఆదివారం బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా పడిపోతుందన్నారు. కర్ణాటకలో మాదిరి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ఆరు గ్యారెంటీలను ప్రవేశపెట్టిందని విమర్శించారు. గెలిచిన తరువాత పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పెన్షన్ ఇవ్వలేదని, రైతులకు ప్రయోజనాలు కల్పించలేదని ప్రజలు ఎలా నమ్మాలని నిలదీశారు. చత్తీస్ గడ్, రాజస్థాన్‌లో రూ. 600 పెన్షన్ ఇస్తున్నారని, కానీ తెలంగాణాలో నాలుగు వేలు ఇస్తామని అబద్ధాలు చెబుతున్నారంటూ ఎర్రబెల్లి మండిపడ్డారు.
16న కేసీఆర్ సభ
ఈనెల 16వ తేదీన జనగామలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఏర్పాటు చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. 2 గంటలకు జనగామలో బహిరంగ సభ ప్రారంభమవుతుందన్నారు. కేసీఆర్ దయతో జనగామ జిల్లా ఏర్పాటైందని, అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. జిల్లాకు సాగునీరు, తాగునీరు వచ్చిందన్నారు. జనగామ పట్టణంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.