Former Talasani OSD arrested: గొర్రెల స్కాంలో సంచలనం - తలసాని మాజీ ఓఎస్డీ కల్యాణ్‌ను అరెస్టు చేసిన ఈడీ
Telangana ED: గొర్రెల స్కామ్ జరిగినప్పుడు తలసాని వద్ద ఓఎస్డీగా ఉన్న కల్యాణ్ ను ఈడీ అరెస్టు చేసింది. ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున నగదు లభ్యమయింది.

Talasani Former OSD arrested: గొర్రెల పంపిణీ స్కామ్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఆ OSD గుండమరాజు కల్యాణ్ కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి (BRS) ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 700 కోట్ల గొర్రెల పంపిణీ కుంభకోణం లో మనీ లాండరింగ్ జరిగిందన్న ఫిర్యాదులతో సోదాలు నిర్వహించారు. కల్యాణ్ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు లభించింది. సోదాల తర్వాత కల్యాణ్ కుమార్ ను అరెస్టు చేసారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్‌లో ఎనిమిది స్థలాలలో సోదాలు నిర్వహించింది, ఇందులో కల్యాణ్ కుమార్ ఇల్లు కూడా ఉంది. కల్యాణ్ ఇంట్లో ED అధికారులు భారీ మొత్తంలో నగదు , పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నగదు లెక్కించడానికి నోటు లెక్కింపు మెషీన్లను కూడా ఉపయోగించారు. కల్యాణ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు OSDగా ఉన్న సమయంలో, గొర్రెల పంపిణీ పథకంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను ఇతర అధికారులు , మధ్యవర్తులతో కలిసి నిధుల దుర్వినియోగం చేసినట్లు ACB ఆరోపించింది.
తెలంగాణలో BRS ప్రభుత్వం 2017లో పేద గొల్ల కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద, గొల్ల కుటుంబాలకు గొర్రెలు మరియు పొట్టేళ్లను సబ్సిడీ రేట్లతో అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఈ పథకంలో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో, తెలంగాణ యాంటీ-కరప్షన్ బ్యూరో (ACB) దర్యాప్తు చేపట్టింది. ACB ప్రాథమిక దర్యాప్తులో ఈ స్కామ్‌లో సుమారు రూ. 700 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు తేలింది.
నకిలీ బ్యాంకు ఖాతాలు మరియు షెల్ వెండర్ల ద్వారా నిధులు మళ్లించారు. గొర్రెల కొనుగోలు, రవాణా, పంపిణీలో అక్రమాలు జరిగాయని గుర్తించారు. ఇన్వాయిస్‌ల నకిలీ తయారీ, గొర్రెలకు ఉపయోగించే ఇయర్ ట్యాగ్‌ల డూప్లికేషన్, రవాణా కోసం అనధికార వాహనాల వినియోగం వంటి అక్రమాలు జరిగాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికలో వెల్లడయింది. 2024 మే 31న, ACB కల్యాణ్ కుమార్‌ను, తెలంగాణ స్టేట్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ CEO సబావత్ రామచందర్‌ను రూ. 2.1 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టు చేసింది. ఆ కేసులో బెయిల్ పై వచ్చారు. ఓఎస్డీని అరెస్టు చేయడంతో అందరి దృష్టి తలసానిపై పడింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ 2019 నుండి BRS ప్రభుత్వంలో జంతు సంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ స్కామ్ ఆయన మంత్రిగా ఉన్న సమయంలో జరిగింది ప్రస్తుతం తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై నేరుగా ఎటువంటి కేసు లేదు. కానీ అతని మాజీ OSD కల్యాణ్ కుమార్ , ఇతర అధికారుల అరెస్టు కారణంగా ఆయన పేరు తరచూ చర్చల్లోకి వస్తోంది.





















