Gurukul Students Padayatra: గురుకుల విద్యార్థుల పాదయాత్ర చూసైనా సమస్య పరిష్కరించండి: హరీష్ రావు చురకలు
Harish Rao fires on Revanth Reddy | ఎన్నికల పాదయాత్రలు ఆపి, గురుకుల విద్యార్థుల పాదయాత్ర సమస్యలపై దృష్టిసారించాలని తెలంగాణ ప్రభుత్వానికి హరీష్ రావు చురకలు అంటించారు.

Gurukul students padayatra in Jogulamba Gadwal district | హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేయడం మానుకుని, గురుకులాల్లో విద్యార్థులకు మంచి భోజనం పెట్టడానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అలంపూర్ గురుకుల విద్యార్థులు చేస్తున్న పాదయాత్ర పై హరీశ్ రావు స్పందించారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేయడం సరికాదని, గురుకుల పిల్లల పాదయాత్రపై ఫోకస్ చేయాలని ప్రభుత్వానికి చురకలు అంటించారు. దిగజారుతున్న గురుకుల, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లను కాపాడాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
ప్రశ్నిస్తే కేసులు పెట్టడం కాదు.. విద్యార్థులకు ఏం చెబుతారు..
ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలు, రైతుల సమస్యలపై ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యలు పరిష్కరించాలని గురుకుల విద్యార్థులు చేస్తున్న పాదయాత్రకు ఏం సమాధానం చెబుతారు?. పరిపాలన గాలికి వదిలేసి, కేవలం రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి గురుకులాల సమస్య కనిపించకపోవడం దారుణం. తరగతి గదుల్లో ఉండాల్సిన భావి భారత పౌరులను నడిరోడ్డు ఎక్కించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది దక్కుతుంది.
క్లాసులో ఉండాల్సిన విద్యార్థులు పాదయాత్రలో..
చదువుకోవాల్సిన విద్యార్థులను పట్టెడు అన్నం, తాగు నీళ్ళ కోసం రోడ్డెక్కి పాదయాత్రలు చేసే దుస్థితి కల్పించింది రేవంత్ రెడ్డి అసమర్ధ పాలన. We want justice అన్నందుకు పోలీసులతో బలవంతంగా విద్యార్థులను డీసీఎంలలో తరలించిన నీచమైన చరిత్ర ఇందిరమ్మ రాజ్యానిది. నేడు తెలంగాణలోని గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు, విద్యార్థుల సమస్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక అడిగినా తెలంగాణ ప్రభుత్వంలో చలనం ఉందా.
ప్రశ్నించిన వారిపై, ప్రతిపక్షాలపై జులుం ప్రదర్శించే @revanth_anumula తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాదయాత్ర చేస్తున్న ఈ గురుకుల విద్యార్థులకు ఏమని సమాధానం చెబుతావు?
— Harish Rao Thanneeru (@BRSHarish) July 30, 2025
పరిపాలన గాలికి వదిలేసి, అనునిత్యం రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి గురుకుల విద్యార్థుల గోస… pic.twitter.com/xMXTH4tvjD
కలెక్టరేట్‌కు పాదయాత్రగా వెళ్తున్న విద్యార్థులు..
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరవాలి. మీ కాంగ్రెస్ పాలనలో పతనమవుతున్న గురుకుల వ్యవస్థను గాడిన పెట్టకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ చౌరస్తా నుంచి పాదయాత్రగా వెళ్లి విద్యార్థులు జిల్లా కలెక్టర్ కు ఇవ్వాలనుకున్న ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని తక్షణం పరిష్కారం చూపించాలి. అంతే కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మరోసారి పాదయాత్ర డ్రామాలు మొదలు పెట్టడం సరికాదు. గురుకుల విద్యార్థులు చేస్తున్న పాదయాత్రల మీద ఫోకస్ చేసి వారి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని’ హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ విషయంపై చొరవ చూపి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సూచించారు.
తమకు తాగడానికి మంచినీళ్లు కూడా లేవని.. ఉప్పు నీళ్లు తాగుతున్నామని, నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదని చాలా సమస్యలు ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. కలెక్టర్ దృష్టికి తమ సమస్య తీసుకెళ్లి పరిష్కారం చూపాలని కోరడానికి వెళ్తుంటే పోలీసులు బలవంతంగా విద్యార్థులను పాదయాత్ర మధ్యలోనే డీసీఎంలలో తరలించారు.






















