Eatala Jamuna: కేసీఆర్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం - ఈటల జమున సవాలు
Eatala Jamuna: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ గారడీ చేయడం నేర్చుకున్నారు. మేము ఒక గుంట భూమి కూడా కబ్జా చేయలేదు. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం’ అని ఈటల జమున సవాలు చేశారు.
Jamuna Hatcheries: జమునా హేచరీస్ కోసం తాము ఒక్క అడుగు భూమి కూడా కబ్జా చేయలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య ఈటల జమున వెల్లడించారు. తాము ఎక్కడైనా భూమి ఆక్రమించుకున్నట్లుగా నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని తేల్చి చెప్పారు. కావాలంటే రేపు సీఎం కేసీఆర్ అధికారులను తీసుకొచ్చుకోవాలని, జమునా హేచరీస్ వద్ద పరిశీలించి తాము ఆక్రమించుకున్నట్లు నిరూపితం అయితే చర్యలు తీసుకోవాలని సవాలు విసిరారు. హైదరాబాద్ శివారులోని షామీర్ పేటలో ఈటల జమున ప్రెస్ మీట్ నిర్వహించి తమ భూముల ఆక్రమణ ఆరోపణలపై స్పందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారడీ చేయడం నేర్చుకున్నారు. మేము ఒక గుంట భూమి కూడా కబ్జా చేయలేదు. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం. జమునా హెచ్చరిస్ కబ్జా చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకోండి. రేపు ముఖ్యమంత్రి అధికారులను తీసుకొని రావాలి. జమునా హేచరిస్ భూములను ఎంక్వయిరీ చేయించండి. కేసీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతను మరిచి పనికిమాలిన పనులన్నీ చేస్తున్నారు.
మా భూమి సర్వే నెంబర్‌లకు, నిన్న ఇచ్చిన సర్వే నంబర్లకు ఎలాంటి పొంతన లేదు. కక్షపూరిత చర్యలకు సీఎం కేసీఆర్ పాల్పడుతున్నారు. టీ న్యూస్, నమస్తే తెలంగాణ పత్రిక ఎవ్వరూ చూడట్లేదు కొనట్లేదు. మాకు 50 నుండి 60 ఎకరాల భూమి ఉంటే 80 ఎకరాలు ఎలా చూపిస్తున్నారు. మా భూములను కేసీఆర్ అక్రమించుకోవాలని చూస్తున్నట్లుండు. మేం ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నాం. మేము ఆక్రమించుకున్నట్లు రుజువు చేస్తారా. కేసీఆర్ దిగజారుడు రాజకీయం చేస్తున్నాడు. కేసీఆర్ ను ప్రజలు తరిమికొడుతున్నా బుద్ధి మార్చుకోవడం లేదు..
‘‘ప్రజలు అధికారం ఇచ్చింది మంచి పనులు చేసేందుకు, ప్రజలను ఇక్కట్లు పెట్టేందుకు కాదు. జమునా హెచరీస్ భూములను మేము కొనుక్కున్నాం. మా వద్ద అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయి. మా భూములు పంచడానికి మా సొమ్ము ఏమైనా కేసీఆర్ జాగీరా? కేసీఆర్ చిల్లర పనులు చేస్తున్నారు. ఆయనకు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు. 10 వేలు ఇచ్చినా టీఆర్ఎస్ కు హుజూరాబాద్ లో ఓట్లు పడలేదు. మా మీద అభియోగాలు పెడితే ప్రజలు నమ్మరు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వకముందు ఆయనకు ఏం లేవు. ఇప్పుడు పదవి వచ్చి అన్ని సంపాదించుకున్నారు. కేసీఆర్ కు పాపం తగులుతుంది.’’ అని ఈటల జమున అన్నారు.