DGP Anjani Kumar: హైదరాబాద్ సీపీ రేసులో సజ్జనార్, డీజీపీ కసరత్తు
DGP Anjani Kumar: నూతన సీపీలు, ఎస్పీల నియామకంపై DGP అంజనీకుమార్ కసరత్తు ప్రారంభించారు. సీఈసీకి జాబితా పంపేందుకు డీజీపీ సిద్ధమవుతున్నారు. ప్రతి పోస్టుకు ముగ్గురు పేర్లతో జాబితాను ప్రభుత్వం పంపనుంది.
DGP Anjani Kumar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝలిపించింది. ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో ఏకంగా 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. హైదరాబాద్ సీపీ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలు, కార్యదర్శి, డైరెక్టర్, కమిషనర్లను బదిలీ చేసింది. అంతేకాకుండా వీరిలో 18 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలకు శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని ఆంక్షలు విధించింది.
ఆయా అధికారులు అధికారులు సత్వరమే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఆ స్థానంలో కొత్తగా వచ్చే వారికి వెంటనే బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ మూడు శాఖలకు కొత్త ముఖ్య కార్యదర్శులతోపాటు బదిలీ వేటుపడిన 20 మంది అధికారుల స్థానంలో కొత్త అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో నూతన సీపీలు, ఎస్పీల నియామకంపై డీజీపీ అంజనీకుమార్ కసరత్తు ప్రారంభించారు. సీఈసీకి జాబితా పంపేందుకు డీజీపీ సిద్ధమవుతున్నారు. ప్రతి పోస్టుకు ముగ్గురు పేర్లతో జాబితాను ప్రభుత్వం పంపనుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఆయా పోస్టుల్లో ఈసీ ఎంపిక చేయనుంది.
హైదరాబాద్ సీపీ రేసులో మహేష్ భగవత్, షికా గోయల్, శివధర్‌రెడ్డి, కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, నాగిరెడ్డి, సజ్జనార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ముగ్గురి పేర్లతో సీఈసీకి ప్రభుత్వం లిస్ట్ పంపనుంది. రాష్ట్ర సర్కార్ పంపిన ముగ్గురి జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు ఉంటే ఈసీ తిరస్కరించే అవకాశం ఉంది. మళ్లీ కొత్తగా పేర్లు ప్రతిపాదన చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించవచ్చు. ఈసీ ఫైనల్ చేసిన తర్వాత ఆయా నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.
ఈసీ అధికారుల అసంతృప్తి
అక్టోబరు 3 నుంచి 5 వరకు ఎన్నికల కమిషన్ అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలపై సమీక్షించారు. పోలీసుశాఖతో నిర్వహించిన సమావేశంలో కొందరు అధికారుల పనితీరుపై ఈసీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో ఎస్పీ స్థాయి అధికారులే ఎక్కువగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా కొందరు పోలీసు అధికారుల పనితీరును విమర్శిస్తూ వారిని మార్చాలని వినతిపత్రం సమర్పించాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున అధికారులను మార్చే అధికారం కమిషన్‌కు ఉంటుంది. దీంతో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు బదిలీ జాబితాలో ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి జిల్లా కలెక్టర్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డిని బదిలీ చేసింది. వీరితో పాటు 13 మంది ఎస్పీలు, సీపీలను సైతం ట్రాన్స్‌ఫర్ చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, వరంగల్ సీపీ రంగనాథ్‌ను సైతం బదిలీ చేసింది. సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎస్పీ భాస్కర్, మహబూబ్‌నగర్ ఎస్పీ నర్సింహ, నాగర్ కర్నూల్ ఎస్పీ మనోహర్, జోగులాంబ గద్వాల ఎస్పీ సృజనకు స్థానచలనం కలిగింది.
నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ ఎస్పీ చంద్రమోహన్, భూపాలపల్లి ఎస్పీ కరుణాకర్, సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇటు ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజ్‌ను సైతం ట్రాన్స్‌ఫర్ చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గురువారం సాయంత్రం 5గంటల కల్లా ప్యానల్ పంపాలని ఈసీ ఆదేశించింది.