Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
Devil Fear: ములుగు జిల్లా జంగాలపల్లిలో దెయ్య భయంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి ఏదో కీడు సోకిందని 2 నెలల్లోనే 20 మంది మృతి చెందారని భయానికి గురవుతున్నారు.
Devil Fear In Jangalapalli Village In Mulugu District: చుట్టూ పచ్చని చెట్లు, పంట పొలాలతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ గ్రామంలో వరుస మరణాలు కలకలం రేపాయి. 2 నెలల్లోనే 20 మంది మృతి చెందడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. తమ గ్రామాన్ని ఏదో దెయ్యం పట్టుకుందని భయాందోళనకు గురవుతున్నారు. ములుగు జిల్లా (Mulugu District) జంగాలపల్లిలో (Jangalapalli) గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. గ్రామానికి ఏదో కీడు సోకిందని అందుకే నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. ఇక్కడే ఉంటే తమకు కూడా మరణం తప్పదనే భయంతో కొందరు ఊరు విడిచి వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్తున్న వారిలో విద్యావంతులు కూడా ఉన్నారు. గ్రామానికి ఉండే చీడ తొలగేందుకు బొడ్రాయికి పూజలు చేయాలని చర్చించుకుంటున్నారు. గ్రామం నుంచి ఎవరు ఆస్పత్రికి వెళ్లినా శవంగానే వస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.
గత నెల రెండో వారం నుంచి ఇప్పటివరకూ 20 మంది మృతి చెందారని.. అందరూ జ్వరం బారిన పడే ప్రాణాలు కోల్పోయారని గ్రామస్థులు పేర్కొంటున్నారు. నాలుగైదు రోజులకోసారి గ్రామంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని.. ఎప్పుడు ఎవరి మరణవార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. ఇంత జరుగుతున్నా గ్రామానికి అధికారులు ఎవరూ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జ్వరాలకు కారణం ఏంటనేది ఎవరూ చెప్పలేకపోతున్నారని.. గ్రామంలో వైద్య శిబిరం పెట్టి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. అటు, ప్రజల్లో మూఢ నమ్మకాలు తొలగించాల్సిన బాధ్యత సైతం అధికారులపైనే ఉందని పేర్కొంటున్నారు.