Telangana MBBS Seats: ఎంబీబీఎస్ సీట్లలో స్థానికతపై మంత్రి దామోదర రాజనర్సింహా క్లారిటీ
Telangana Medical Seats: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33 ప్రకారం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణించే నిబంధన వర్తించదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
Damodar Raja Narasimha gives clarity over MBBS seats | హైదరాబాద్: తెలంగాణలో ఎంబీబీఎస్ ప్రవేశాలలో స్థానికత అంశంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టత ఇచ్చారు. ఎంబీబీఎస్ లో ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం జీవో 33 విడుదల చేసింది. తెలంగాణ విద్యార్థులు నష్టపోతున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఎక్స్ పోస్ట్ పై మంత్రి దామోదర స్పందించారు. జీవో 33 ప్రకారం 6 నుంచి 12 వరకు ఒకేచోట నాలుగేళ్లు చదివిన వారికి వర్తించే స్థానికత కల్పించే నిబంధన ఇకపై వర్తించదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం, రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధనల ప్రకారం G.O.114 Dt.5.7.2017ని జారీ చేసింది. ఆ జీవో ప్రకారం 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణిస్తారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ నిబంధనను కొనసాగించింది కనుక G.O.33 జారీతో ఇతర రాష్ట్ర విద్యార్థులు స్థానికులు అవుతారనే వాదన సరైనది కాదన్నారు.
గత ప్రభుత్వం ఇచ్చిన జీవో G.O.114 ప్రకారం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 6 నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులు కూడా కనీసం 4 సంవత్సరాలు విద్యార్థి చదివిన ప్రాంతంలో స్థానిక అభ్యర్థులు అవుతారు. దీని ప్రకారం విద్యార్థి తెలంగాణలో 4 సంవత్సరాలు, మిగిలిన 3 ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌లో చదివితే అతన్ని తెలంగాణలో స్థానికుడిగా పరిగణించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గత 10 సంవత్సరాలుగా ఈ నిబంధన అమల్లో ఉంది. కానీ రాష్ట్ర విభజనకు సంబంధించి తెచ్చిన ఈ నిబంధన జూన్ 2, 2024 తర్వాత కొనసాగించలేమని మంత్రి దామోదర రాజనర్సింహ తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేశారు.
తెలంగాణలో ఇకనుంచి ఎంబీబీఎస్ సీట్లలో జాతీయ కోటా మినహా మిగిలిన కన్వీనర్ కోటా సీట్లన్నీ స్థానిక విద్యార్థులకే దక్కనున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు 10 సంవత్సరాలపాటు అమలైన 15 శాతం అన్‌రిజర్వ్‌డ్ కోటా సీట్లు జూన్ 2, 2024 నుంచి రద్దయ్యాయి. గత ఏడాది వరకు మెడికల్ కాలేజీల్లో 15 శాతం అన్‌రిజర్వ్‌డ్ కోటా సీట్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీపడేవారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33 ప్రకారం కన్వీనర్ కోటా సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయనున్నారు.
2023-24 అకడమిక్ ఇయర్ వరకు 6వ తరగతి నుంచి ఇంటర్ (12వ తరగతి) వరకు గరిష్ఠంగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణించేవారు. జీవో 33 ప్రకారం స్థానికతపై ఈ అకడమిక్ ఇయర్ నుంచి చేసిన మార్పులతో రాష్ట్రానికి చెందిన వారికే ఎక్కువ అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. MBBS, BDS సీట్లలో బీసీలకు 29 శాతం సీట్లు, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం దక్కనున్నాయి.
Also Read: TG DSC Exams: ప్రశాంతంగా ముగిసిన డీఎస్సీ పరీక్షలు, మొత్తం 87.61 శాతం అభ్యర్థులు హాజరు - ఫలితాలు ఎప్పుడంటే?
8,315 సీట్లు అందుబాటులో..
కొత్తగా అందుబాటులోకి వచ్చిన 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తం కాలేజీలు 60కి చేరాయి. ఇందులో 30 ప్రభుత్వ, 30 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 8,715 అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 4,115 సీట్లు ఉండగా, ప్రైవేట్ కాలేజీల్లో 4,600 సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 3,498 సీట్లు ఉండగా.. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 2,300 మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో జాతీయ కోటా కింద 617 సీట్లు భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లను కాళోజీ హెల్త్ వర్సిటీ భర్తీ చేయనుంది.