TG DSC Exams: ప్రశాంతంగా ముగిసిన డీఎస్సీ పరీక్షలు, మొత్తం 87.61 శాతం అభ్యర్థులు హాజరు - ఫలితాలు ఎప్పుడంటే?
TGDSC: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం 87.61 శాతం అభ్యర్థులు హాజరయ్యారు.
Telangana DSC 2024 Exams: తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ-2024 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జులై 18న ప్రారంభమైన పరీక్షలు ఆగస్టు 5 వరకు మొత్తం 13 రోజులపాటు పరీక్షలు కొనసాగాయి. జులై 18న స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం, పీఈటీ, భౌతిక శాస్త్రం పరీక్షలతో మొదలై ఆగస్ట్ 5న లాంగ్వేజ్ పండిట్ (హిందీ) పరీక్షతో డీఎస్ సీ పరీక్షలు ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 55 పరీక్ష కేంద్రాల్లో షిఫ్టుల వారీగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,45,263 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 87.61 శాతం అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1,61,745 అభ్యర్థులకుగాను 1,37,872 (85.24 శాతం), సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు 88,005 అభ్యర్థులకుగాను 81,053 (92.10 శాతం), లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు 18,211 అభ్యర్థులకుగాను 16,092(88.36 శాతం), పీఈటీ పోస్టులకు 11,996 అభ్యర్థులకుగాను 10,246 (85.41 శాతం) మంది హాజరయ్యారు.
వారంరోజుల్లో కీ.. ఫలితాలు ఎప్పుడంటే?
రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో డీఎస్సీ పరీక్షలను విద్యాశాఖ నిర్వహించింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లోని 56 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. డీఎస్సీ పరీక్షలు ముగియడంతో విద్యాశాఖ ఫలితాల మీద దృష్టి పెట్టింది. వారం రోజుల్లో ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించి.. ఆపై తుది ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. అనంతరం.. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేస్తారు. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు నెలాఖరునాటికి డీఎస్సీ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. సాధ్యమైనంత త్వరలో ఫలితాలను విడుదల చేసి సెప్టెంబర్ 5న 'ఉపాధ్యాయ దినోత్సం (టీచర్స్ డే)' నాటికి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి గత ఫిబ్రవరి 28న పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం విధితమే. దరఖాస్తుల గడువు ఈ నెల 20తో ముగిసింది. ఈ పోస్టులకు మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థుల పరంగా చూస్తే, సుమారు 2 లక్షల వరకు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్(SA) ఫిజికల్ సైన్స్ పరీక్ష, సెకండ్‌షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) పరీక్ష జరగనున్నాయి. జులై 19 నుంచి 22 వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ (SGT) పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక జులై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ (SA Maths), జులై 24న స్కూల్ అసిస్టెంట్ బయాలాజికల్ సైన్స్ (SA Biology), జులై 26న తెలుగు భాషా పండిట్ (Telugu Language Pandit), సెకండరీ గ్రేడ్‌టీచర్ పరీక్ష, జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ (SA Social Studies) పరీక్ష నిర్వహించారు.