Mahabubabd News: 3 పార్టీల చూపు ఆ స్థానం వైపు - ఎవరికి దక్కేనో?
Warangal News: రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అధికార పార్టీ సహా బీఆర్ఎస్, బీజేపీ సైతం మహబూబాబాద్ ఎంపీ స్థానంపై ఫోకస్ చేశాయి.
Parties Focus on Mahabubabad MP Seat: తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ (Congress) అధికారం చేపట్టిన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. అయితే, ఇదే కోవలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సైతం ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రధానంగా మహబూబాబాద్ (Mahabubabad) ఎంపీ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలోని మహబూబాబాద్ పార్లమెంట్ పై ఎలాగైనా జెండా ఎగరెయ్యాలని కాంగ్రెస్ చూస్తోంది. అందులో మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలవడం, ఓడిన చోట సంప్రదాయ ఓటు బ్యాంకు ఉండటం కాంగ్రెస్ కు కలిసాచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్టీ రిజర్వేషన్ స్థానంలో 2014, 2019 ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో టీఆర్ఎస్ మహబూబాబాద్ సీటును దక్కించుకుంది.
మెజార్టీ స్థానాల్లో విజయం
రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ అసెంబ్లీ స్థానాలను ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలోనే గెలిచింది. పార్టీ ఆదేశాల మేరకు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ స్థానాలపై దృష్టి పెట్టారు. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపడం కోసం విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికలోనూ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోసారి అవకాశం ఇవ్వాలా లేదా.. కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అనే దానిపై యోచిస్తోంది. బెల్లయ్య నాయక్, పోలీస్ అధికారి నాగరాజులు ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు.
హ్యాట్రిక్ లక్ష్యంగా
ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం మహబూబాబాద్ పార్లమెంటు స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2014, 2019లో ఈ సీటును టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలనే ఆలోచనలో గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. ఇందుకోసం గురువారం తెలంగాణ భవన్ లో పార్లమెంటరీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో అధిష్టానం సమావేశం నిర్వహించింది. మహబూబాబాద్ లో పార్టీ బలాబలాలు అసెంబ్లీలో ఎన్నికల్లో ఓటమిపై చర్చ జరిపారు. గెలిచే అవకాశం ఉన్న బలమైన అభ్యర్థిని పోటీ లో ఉంచాలని అధినాయకత్వానికి నేతలు సూచించారు. ఎంపీ సీటు కోసం సిట్టింగ్ ఎంపీ కవిత, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లు ప్రధానంగా పోటీ పడుతున్నారు. వీరితో పాటు ఐటీ కమిషనర్, మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు మోతిలాల్ టిక్కెట్ ఆశిస్తున్నారు.
బీజేపీ పరిస్థితి ఇదీ
ఇక భారతీయ జనతా పార్టీ సైతం మహబూబాబాద్ ఎంపీ స్థానంపై గురి పెట్టింది. అధికారంలోకి వచ్చే ఏ చిన్న అవకాశాన్ని సైతం వదులుకోకూడదని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా 2019లో ఎంపీగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన హుస్సేన్ నాయక్, బానోత్ విజయలక్ష్మి పోటీ పడుతున్నారు. విజయలక్ష్మి భర్త కిషన్ నాయక్ వైఎస్ వర్గీయులుగా కాంగ్రెస్ లో కొనసాగారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి బంగపడడంతో ఎన్నికల ముందు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.
ఎవరి ధీమా వారిదే
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాలు ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, ములుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. భద్రాచలం బీఆర్ఎస్ గెలవగా, మిగతా 6 స్థానాలు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం సాధించారు. 2019లో అతి తక్కువ ఓట్లతో కాంగ్రెస్ ఈ స్థానంలో ఓటమి పాలయ్యింది. ఈ క్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని హస్తం పార్టీ హస్తగతం చేసుకొనే అవకాశాలు లేకపోలేదని పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల ఓటమిని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి భర్తీ చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిన మనకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరెయ్యాలని చూస్తున్నాయి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నాయి.
Also Read: KTR : ఓడించారని ప్రజల్ని తప్పు పట్టవద్దు - పార్టీ నేతలకు కేటీఆర్ హితవు !