తెలంగాణలో రేపట్నుంచే ఇంటర్ పరీక్షలు
విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణలో రేపట్నుంచే (మార్చి 15) ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి! పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు అధికారులు సర్వంసిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి 4,82,677 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. సెకండ్ ఇయర్ వాళ్లు 4,65,022 మంది. మొత్తం 9,47,699 మంది స్టూడెంట్స్ పరీక్షలకు హాజరవుతున్నారు.
రాష్ట్రంలో 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇంటర్ బోర్డు అధికారులు. ఇందులో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలు కలుపుకుని 614, ప్రయివేటు జూనియర్ కాలేజీలు 859 ఉన్నాయి. 1,473 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 1,473 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు , 26,333 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్లను ఇంటర్ బోర్డు నియమించింది.
ఇంటర్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతోపాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్‌ఎస్ అందుబాటులో ఉంచారు. పరీక్షా కేంద్రాల దగ్గరికి విద్యార్థులు సకాలంలో చేరేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ సమయంలో తలెత్తే సమస్యలకు సత్వర పరిష్కారం లభించే విధంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షల సమయంలో విద్యుత్‌కు ఆటంకం కలగకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.
హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించారు. ఎగ్జామ్ ప్యాడ్ చూపిస్తే ఆర్టీసీ బస్సు ఏదైనా సరే, ఎక్కడైనా సరే ఆపి, విద్యార్ధిని ఎక్కించుకునేలా ఆదేశాలు ఇచ్చారు. పరీక్షా కేంద్రాల వైపు ఎక్కువ బస్సులు తిరిగేలా సూచనలిచ్చారు. విద్యార్థుల కోసం కంట్రోల్ రూం , టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ వంటివాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తినకపోతే చదవలేరు, రాయలేరు:
ఎగ్జామ్ అనగానే ఒకరమైక ఫోబియా పెట్టుకుని, మానసికంగా దెబ్బతినవొద్దు. ధైర్యంగా పరీక్షలు రాయాలి. ప్రశ్నాపత్రం చూడగానే కన్‌ఫ్యూజ్ కావొద్దు. సహచర విద్యార్థులతో మన చదువును అస్సలు పోల్చుకోవద్దు. అర్ధరాత్రి వరకు చదవడం అస్సలు మంచిది కాదు. రాత్రి 10.30 వరకు చదివి ప్రశాంతంగా నిద్రపోయి 5.30 గంటలకు నిద్ర లేవాలి,. ప్రతి రోజు కనీసం 7 గంటలైనా నిద్రపోవాలి. అల్పాహారం తీసుకున్న తర్వాతనే చదవాలి. ఏమీ తినకుండా చదివితే బుర్రకు ఎక్కదు. మెదడుకు మనం తినే ఆహారమే మేత. కాబట్టి కచ్చితంగా తినే చదవాలి. తినే పరీక్ష రాయాలి. పాఠాలను బట్టీ పట్టడం కాకుండా కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవాలి. ఏకాగ్రతను దెబ్బతీసే విషయాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా టీవీ, సెల్ ఫోన్, సోషల్ మీడియా వగైరా వుంటే కట్టగట్టి అటక మీద పడేయాలి.
పరీక్షకు వెళ్లే ముందు స్టేషనరీ ఐటెమ్స్, ముఖ్యంగా హాల్‌టికెట్ ఉందో లేదో సరిచూసుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటరు ఒకరోజు ముందే చూసుకుని వస్తే బెటర్. పరీక్షకు కావాల్సిన పెన్నులు, ప్యాడ్, పెన్సిల్, రబ్బర్ ముందురోజు సిద్ధం చేసుకోవాలి. పరీక్ష కేంద్రాలకు కనీసం అరగంట ముందైనా వెళ్లి, హాల్‌టికెట్ నంబర్లు చూసుకోవాలి. వేసవి కాలం దృష్ట్యా అందరూ ఉదయం పూటనే టిఫిన్ తిని, వాటర్ బాటిల్‌ను వెంట తీసుకువెళ్లాలి. పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, డిజిటల్ వాచీలను అనుమతించరు కాబట్టి, వాటి జోలికి వెళ్లకండి! ఓఎంఆర్ షీట్‌ను, ప్రశ్నాపత్రాలను ముందుగానే సరిచూసుకుని, హాల్ టికెట్ నంబరు వేసిన తర్వాత పరీక్ష రాయాలి. రేపటి నుండి ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.