CM Revanth Reddy: 'మీ లక్ష్యం ఆకాశమే అయితే మేం రాకెట్ తో సిద్ధం' - బయో ఆసియా సదస్సులో ఫార్మా కంపెనీలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
Bio Asia 2024: ఫార్మా కంపెనీలకు పూర్తి బాసటగా నిలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో 21వ బయో ఆసియా సదస్సులో ఆయన మంగళవారం పాల్గొన్నారు.
CM Revanth Attended in Bio Asia Summit 2024 in Hyderabad: భాగ్యనగరం ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాలతో పాటు లైఫ్ సైన్సెస్ కు రాజధాని అనడంలో ఎలాంటి సందేహం లేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న 21వ బయో ఆసియా - 2024 సదస్సులో (Bio Asia Summit - 2024) సీఎం, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. జీవ వైవిధ్యం, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులపై చర్చించారు. అలాగే, ఔషధ రంగంలో ఆవిష్కరణలు, ఔషధ పరికరాల ప్రోత్సాహకాలపైనా చర్చలు జరిపారు. 'కొవిడ్ అనంతరం ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించారు. ప్రపంచంలో కొవిడ్ కు 3 వ్యాక్సిన్లు వచ్చాయి. వాటిలో ఒక వ్యాక్సిన్ అందించిన ఘనత మన హైదరాబాద్ కు దక్కింది. భాగ్యనగరం ఎన్నో పరిశోధనలకు నిలయంగా ఉంది. 20 ఏళ్లుగా బయో ఆసియా సదస్సులు హైదరాబాద్ ను ఉన్నత స్థానంలో నిలిపాయి. జాతీయ, అంతర్జాతీయ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఎంఎస్ఎంఈలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది.' అని పేర్కొన్నారు.
'మేం రాకెట్ తో సిద్ధం'
ఫార్మా రంగంలో సవాళ్లను తాను అర్థం చేసుకోగలనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల కొందరు ఫార్మా రంగ ప్రతినిధులతో సమావేశమయ్యానని.. వారి సమస్యలు వివరించారని చెప్పారు. ఫార్మా రంగానికి ప్రభుత్వం తరఫున పూర్తి బాసటగా నిలుస్తామని.. 'ఆకాశమే మీ లక్ష్యమైతే మేం రాకెట్ తో సిద్ధం' అని ఫార్మా కంపెనీలకు సీఎం పిలుపునిచ్చారు.
'అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాం'
21 ఏళ్ల క్రితం బయో ఆసియా సదస్సు ప్రయాణం మొదలైందని, జీవ వైద్య రంగంలో అద్భుత ఆవిష్కరణలకు ఇది మంచి వేదకని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 'పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన జీవ వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. కేవలం పరిశ్రమల స్థాపనే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యోగాల కల్పన చేసే విధంగా పాలసీ రూపొందిస్తాం. విద్యార్థులకు చదువుతో పాటు ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించేలా తగిన శిక్షణ ఇచ్చే విధానం తీసుకొస్తాం. రాష్ట్రాన్ని నైపుణ్య శిక్షణ కేంద్రంగా మార్చేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సదస్సులో ఓ విదేశీ కంపెనీ, బయోలాజికల్ ఈ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. 50 మిలియన్ డోసుల డెంగ్యూ వ్యాక్సిన్ కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐటీ రంగ అభివృద్ధికి తోడ్పడుతున్నట్లుగానే ఫార్మా, ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కృషి చేస్తాం. ఐటీలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా లైఫ్ సైన్సెస్ పాలసీ తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో తెలంగాణ హ్యూమన్ రిసోర్స్ సెంటర్ గా మారనుంది.' అని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని.. కొత్త ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనమని మంత్రి తెలిపారు.
Also Read: Mahalaxmi Scheme: రూ.500కే గ్యాస్ సిలిండర్ - తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ