KCR Drugs Issue : డ్రగ్స్ అంతు చూడాల్సిందే..28న కేసీఆర్ అత్యున్నత సమీక్ష !
తెలంగాణలో డ్రగ్స్ కట్టడి కోసం అత్యున్నత సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. 28వ తేదీన డ్రగ్స్ కట్టిడికి సంబంధించిన అన్ని స్థాయిల అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు.
హైదరాబాద్‌లో తరచూ బయటపడుతున్న డ్రగ్స్ వ్యవహారాలను సీఎం కేసీఆర్ మరోసారి సీరియస్‌గా తీసుకున్నారు.ఈ నెల 28 వ తేదీన ప్రగతి భవన్‌లో డ్రగ్స్ నియంత్రణపై పోలీసు, ఎక్సైజ్ శాఖలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలను డీజీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి.. వెయ్యి మందితో నార్కోటిక్స్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 28వ తేదీన జరగనున్న సమావేశాన్ని డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి అన్ని స్థాయిల అధికారులను ఆహ్వానిస్తున్నారు.
హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం ఊహించని స్థాయిలో పెరిగింది. ఇటీవల బడా స్మగ్లర్ టోనీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తరవాత బయటపడిన విషయాలు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి. సమాజంలో పలుకుబడి ఉండి.. వందల కోట్ల వ్యాపారాలు చేస్తున్న వారు కూడా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా తేలింది. వీరందర్నీ అరెస్ట్ చేసి జైలుకు తరలిచారు. మరికొంత మంది పరారీలో ఉన్నారు. డ్రగ్స్ సమస్య ఊహించినంత చిన్నదేం కాదని.. పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వరుసగా డ్రగ్స్ స్మగ్లర్లు దొరుకుతూండటం... ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా డ్రగ్స్‌కు బానిసలైనట్లుగా తేలడంతో .. సమస్యను కింది స్థాయి నుంచి తేల్చాల్సి ఉందని నిర్ణయానికి వచ్చారు.
ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ కేసు వ్యవహారం తర్వాత రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ సీపీలతో సీఎం కేసీఆర్ బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. డ్రగ్స్ వినియోగంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఇది వరకే హెచ్చరించిన క్రమంలో సీఎం కేసీఆర్ కూడా డ్రగ్స్ తీసుకున్న వారు ఎంతటి వారైనా వదలొద్దని పోలీసులను ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినిపించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందు కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలను ప్రభుత్వం నిర్దేశించుకోనుంది.
హైదరాబాద్ మెట్రో పాలిటన్ సిటీ కావడంతో డ్రగ్స్ కేసులు ఎప్పుడూ బయటపడుతూనే ఉన్నారు. ఇటీవల కేసీఆర్ గంజాయి వినియోగం పెరిగిపోయిందన్న నివేదికలు రావడంతో కఠిన చర్యలకు ఆదేశించారు. పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ..గంజాయి అక్రమ రవాణాను కట్టడి చేశారు. ఎప్పటికప్పుడు అరెస్టులు చూపించారు. ఈ క్రమంలో గంజాయి వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించామని పోలీసులు అనుకుంటున్నారు కానీ.. ఈ వైట్ కాలర్ డ్రగ్స్ విషయంలో మాత్రం ఉక్కుపాదం మోపాలని డిసైడయ్యారు. ముఖ్యంగా ఎలా దిగుమతి అవుతున్నాయో తెలుసుకుని ఆ మార్గాలన్నింటినీ కట్టడి చేస్తే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు.