KCR News: కేంద్ర మంత్రులు గడ్కరీ, షెకావత్‌లను కలిసిన కేసీఆర్.. కీలక అంశాలపై చర్చలు
ఈ నెల 1వ తేదీన సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ భవన శంకుస్థాపన కోసం అక్కడికి వెళ్లారు. ఆ రోజు నుండి ఆయన ప్రముఖుల్ని కలుస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో తీరిక లేకుండా గడుపుతున్నారు. రాజధానిలో టీఆర్ఎస్ పార్టీ భవన శంకుస్థాపన కోసం ఢిల్లీకి వెళ్లిన ఆయన అప్పటి నుంచి ప్రధాని మోదీ సహా వివిధ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేసీఆర్ వారి దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని, కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను సీఎం కేసీఆర్ కలిశారు.
హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డును ఆమోదించినందుకు నితిన్ గడ్కరీకి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు గంటపాటు నితిన్ గడ్కరీతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ, అందుకు నిధులు ఇతర జాతీయ రహదారులకు సంబంధించిన అంశాల గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణలో రోడ్ల విస్తరణ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
గజేంద్ర సింగ్ షెకావత్‌తోనూ భేటీ
మరోవైపు, సీఎం కేసీఆర్ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌ను కూడా కలిసి ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు కేంద్ర మంత్రితో కేసీఆర్ సమావేశమయ్యారు. ఆయనను శాలువాతో సత్కరించి తెలంగాణ మెమెంటోలను అందజేశారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌లోని అంశాల అమలుకు సంబంధించి రాష్ట్రం తరపున పూర్తి సహకారం అందిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు.
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌పై అభ్యంతరాలను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుపై సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రికి తెలిపారు. ఇప్పటికే పిటిషన్ విత్ డ్రా కోసం మరో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. గెజిట్ అమలులో ఇబ్బందులు రాకుండా నిర్ణయం తీసుకోవాలని.. గెజిట్ అమలు ఇంత త్వరగా సాధ్యమవుతుందా పరిశీలించాలని కేంద్ర మంత్రిని కోరారు. కొంత గడువు తర్వాత అమలుపైనా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా గోదావరిపై ప్రాజెక్టులన్నింటినీ షెకావత్‌కు సీఎం కేసీఆర్ వివరించారు. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ సమావేశానికి హాజరైనట్లు షెకావత్‌కు రజత్ కుమార్ తెలిపారు. అజెండాలో పేర్కొన్న అంశాలపై చర్చించినట్లు వివరించారు.
ఈ నెల 1వ తేదీన సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ భవన శంకుస్థాపన కోసం అక్కడికి వెళ్లారు. ఆ రోజు నుండి ఆయన ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు అమిత్ షాతో భేటీ అయ్యారు. అలాగే, నేడు (సెప్టెంబరు 6) రాత్రి కేంద్ర మంత్రి షెకావత్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు.