CM KCR: దళిత బంధు పథకం కాదు.. ఉద్యమం.. గుర్తుంచుకోవాలే: కేసీఆర్
దళిత బంధు పథకంపై ఇవాళ తొలి అవగాహన సదస్సు జరిగింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు.
దళిత బంధు పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రగతిభవన్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ భేటీలో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 412 మంది దళితులు పాల్గొన్నారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్,హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
దళిత బంధు అవగాహనక సదస్సులో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ దళిత బంధు.. కేవలం కార్యక్రమం కాదు అదో ఉద్యమం అని కేసీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీద యావత్ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి ఉంటది అని సీఎం అన్నారు. అందరూ ఆ దిశగా ధృఢ నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఒక్కడి తో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ మీద వత్తిడి తెచ్చి...విజయం సాధించి పెట్టింది. ప్రతి విషయంలో అడ్డుపడే శక్తులు ఉంటాయి. నమ్మిన ధర్మానికి కట్టు బడి ప్రయాణంకొనసాగించినప్పుడే విజయం సాధ్యం. డా.బాబాసాహెబ్ అంబేద్కర్ కృషితో దళిత సమాజంలో వెలుతురు ప్రసరించింది. ఆర్థికంగా పటిష్టమైన నాడే దళితులు వివక్ష నుంచి దూరం. - సీఎం కేసీఆర్
ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దళితులు ఆర్థికంగా పటిష్టమైన నాడే వివక్ష నుంచి దూరమవుతారన్నారు. పథకంపై రాష్ట్రవ్యాప్తంగా దళితులకు అవగాహన కల్పించాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే దళితుల అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధికి దారులు వేస్తుందన్నారు. నైపుణ్యం, ప్రతిభ ఉన్న దళితవర్గాన్ని అంటరానితరం పేరుతో ఉత్పాదక రంగానికి దూరం చేయడం బాధాకరమన్నారు. మహిళలను జెండర్ పేరుతో అనుత్పాదక రంగానికే పరిమితం చేయడం తెలివితక్కువ పని కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సీఎం సదస్సులో మాట్లాడారు. ఈ అవగాహన సదస్సుకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం, ప్రతీ మున్సిపాలిటీ నుంచి నలుగురు చొప్పున మొత్తం 412 మంది దళిత పురుషులు, మహిళలు హాజరయ్యారు.
వారితో పాటు 15 మంది రిసోర్స్ పర్సన్స్ కూడా సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. దళిత బంధు అవగాహన సదస్సుకు హాజరయ్యే వారంతా ప్రత్యేక బస్సుల్లో హుజూరాబాద్ కేంద్రానికి వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. దళిత బంధుపై పథకం విషయమై.. కేసీఆర్ మెున్న హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన రాజేశం అనే వ్యక్తికి ఫోన్ చేశారు. ప్రపంచంలోనే ఇది గొప్ప పథకమని పేర్కొన్నారు. ఈ మాటల మధ్యలో రాజేశం ఈటల ప్రస్తావన తీసుకు రాగా.. 'ఈటల రాజేందర్ చాలా చిన్నోడు.. అతని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. అయ్యేది లేదు.. పొయ్యేది లేదు..' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దళిత బంధు పథకం హుజరాబాద్ లో ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రమంతా వర్తింపజేస్తామని కేసీఆర్ చెప్పారు.
Also Read: BS Yediyurappa Resigns: కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామా
India China Border Dispute: డ్రాగన్ కవ్వింపు చర్యలు.. భారత భూభాగంలో గుడారాలు