KTR Lawyer: 'అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పకుండా ఏసీబీ కేసులా?' - హైకోర్టులో కేటీఆర్ తరఫు లాయర్ల వాదనలు
Telangana News: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంపై ఏసీబీ కేసు కొట్టేయాలని కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేశారని కేటీఆర్ లాయర్లు తెలిపారు.
KTR Lawyers Comments In High Court: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హైకోర్టులో (High Court) క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం దీనిపై విచారణ జరగ్గా.. కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం, ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు వర్తించవని అన్నారు. 'ఈ కేసుకు ముఖ్యంగా 13(1)(a), 409 సెక్షన్లు వర్తించవు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అనేందుకు ఆధారాలు లేవు. ప్రొసీజర్ పాటించలేదనడం సరికాదు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక విచారణ లేకుండా కేసు పెట్టారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. కార్ రేస్ నిర్వహణకు 2022 అక్టోబర్ 25న ఒప్పందం జరిగింది. సీజన్ 10 నిర్వహణకు స్పాన్సర్ వెనక్కు తగ్గారు. రేస్ నిర్వహణలో ఇబ్బందుల నివారణకే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇబ్బందులు రాకూడదనే హెచ్ఎండీఏ చెల్లింపులు చేసింది.' అని పేర్కొన్నారు.
కొత్త ప్రభుత్వం ఉల్లంఘన
'సీజన్ 9 వల్ల దాదాపు రూ.700 కోట్లు లాభం వచ్చింది. ఆర్థికశాఖ అనుమతి లేదని ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. కార్ రేసింగ్ ఒప్పందాన్ని కొత్త ప్రభుత్వం ఉల్లంఘించింది. కొత్త ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దైంది. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యానికి కారణాలు చెప్పలేదు. సుప్రీం తీర్పుల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం తగదు. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ అవసరమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. వాటిని ఏసీబీ అధికారులు పట్టించుకోలేదు. ప్రజా ప్రతినిధిపై కేసుకు ముందు ప్రాథమిక విచారణ చేయాలి. ఈ నెల 18న ఫిర్యాదు అందగానే.. 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేటీఆర్ స్పెక్యులేషన్ చేసినట్లు ఎక్కడా పేర్కొనలేదు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు. కానీ, అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు.' అని కేటీఆర్ తరఫు లాయర్ సుందరం వాదించారు.
'కేటీఆర్ పాత్ర దర్యాప్తులో తేలుతుంది'
అటు, ఈ వ్యవహారంపై ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ నమోదు ప్రాథమిక అంశం మాత్రమేనని.. అందులో పేర్కొన్న అంశాలే అంతిమం కాదని అన్నారు. 'ఏసీబీ అధికారులు దర్యాప్తులో తేలే విషయాల ఆధారంగా సెక్షన్లు చేరుస్తారు. 2 నెలల క్రితమే కేసు నమోదుకు నిర్ణయించారు. దీనిపై గవర్నర్ నిర్ణయానికి పంపారు. ఆయన ఆమోదించాకే కేసు నమోదు చేశారు. ఫార్ములా సంస్థకు విదేశీ కరెన్సీలో డబ్బు చెల్లించారు. దీంతో హెచ్ఎండీఏపై అధిక భారం పడింది. విదేశీ కరెన్సీలో చెల్లింపు కోసం ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకోలేదు.' అని ఏజీ పేర్కొన్నారు. ఈ క్రమంలో గవర్నర్ అనుమతి కాపీని కోర్టు అడగడంతో ఏజీ అందజేశారు.
కాగా, చెల్లింపుల్లో కేటీఆర్ పాత్ర ఏంటని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ నమోదు దర్యాప్తు కోసమేనని.. కేటీఆర్ పాత్ర ఏంటో దర్యాప్తులో తేలుతుందని ఏజీ తెలిపారు. ఈ వ్యవహారంలో రూ.56 కోట్లకు పైగా చెల్లింపుల్లో నిబంధన ఉల్లంఘన జరిగిందని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు.