Kavitha: బిగ్ రిలీఫ్ - రేపు కవితను కలవనున్న భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీష్ రావు
Telangana BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితను కుటుంబసభ్యులు కలిసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది.
BRS MLC Kavitha to meet her family members: ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కుటుంబసభ్యులు కలిసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు కోర్టు సమయం కేటాయించింది. కస్టడీలో ఉండే వారం రోజులపాటు ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఆరుగురు వ్యక్తుల వరకు కవితను కలుసుకోవచ్చునని కోర్టు పేర్కొంది. కవిత కోరినట్లుగా భర్త అనిల్‌తో శరత్, శ్రీధర్, ప్రణీత్‌ను కలిసేందుకు అవకాశం కల్పించింది కోర్టు. కోర్టు నిర్దేశించిన సమయంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు కేటీఆర్, హరీష్ రావు.. కవితను కలిసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
కోర్టు మార్చి 23 వరకు ఏడు రోజులపాటు కవితకు ఈడీ కస్టడీ విధించింది. ఆమె కోరినట్లుగా బుక్స్, స్టేషనరీతో పాటు ఆమె కళ్లద్దాలు అందించాలని కోర్టు సూచించింది. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కవితను విచారించాలని కోర్టు ఆదేశాలలో పేర్కొంది. విచారణను వీడియో రూపంలో రికార్డ్ చేయాలని ఈడీ అధికారులను కోర్టు ఆదేశించింది. కవితకు ఇంటి నుంచి భోజనం పంపించేలా కోర్టు అనుమతి ఇచ్చింది. మార్చి 23న 12 గంటలకు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది.
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలింపు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టైన కవితకు షాక్ తగిలింది. కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ ఎవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 23 వరకూ ఆమెకు కస్టడీ విధించారు. శుక్రవారం సాయంత్రం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. రాత్రి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 23 వరకూ కవితను ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ రోజూ కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు.. ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు కూడా కోర్టు అనుమతించింది. ఈ నెల 23న మధ్యాహ్నం కోర్టులో హాజరు పరచాలని ఆదేశాలిచ్చింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు విక్రమ్ చౌదరి, మోహిత్ రావులు వాదనలు వినిపించగా.. ఈడీ తరఫున జోయబ్ హుస్సేన్, ఎన్.కే మట్టా వాదనలు వినిపించారు.