KTR About Congress: 6 గ్యారంటీలు ఎగ్గొట్టేందుకే శ్వేత పత్రాల డ్రామాలు- కాంగ్రెస్ పై కేటీఆర్ సెటైర్లు
Congress 6 Guarantees in Telangana: ఎన్నికల హమీలు ఎగగొట్టేందుకే కాంగ్రెస్ శ్వేత పత్రాల డ్రామాలకు తెరలేపిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
BRS Sircilla MLA KTR: హైదరాబాద్: ఎన్నికల హమీలు ఎగగొట్టేందుకే కాంగ్రెస్ శ్వేత పత్రాల డ్రామాలకు తెరలేపిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల కోసం గ్యారెంటీలను గాలికొదిలేసి… శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదన్నారు. ప్రచారంలో నోటికొచ్చిన హామీలు ఇచ్చి, అధికారంలోకి రాగానే మభ్యపెడతారా..? కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా..? అని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నదని, గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని విమర్శించారు.
శ్వేత పత్రాల తమాషాలు.. పవర్ పాయింట్ షోలు దేనికోసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికార పీఠం దక్కగానే.. మొండిచేయి చూపించడానికి తొండి వేషాలేస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేళ్ల మా ప్రగతి ప్రస్థానం.. తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకమని, శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు, అప్పులు, ఆదాయ వ్యయాల శ్వేత పత్రాలేనని చెప్పారు.
దశాబ్ది ఉత్సవాల్లో మేం విడుదల చేసిన ప్రతి ప్రగతి నివేదిక... ఓ స్వచ్ఛమైన శ్వేతపత్రమని, ఆడిట్ రిపోర్ట్ లు.. ఆర్బీఐ నివేదికలు
ప్రతి పైసాకు లెక్కా పత్రం చూపించి ఆర్థిక స్థితిని ఆవిష్కరించాయని అభిప్రాయపడ్డారు. ప్రతిరంగంలో పదేండ్ల ప్రగతి నివేదికలు
ప్రచురించి.. ప్రజల ముందు ఉంచామని.. ఇప్పుడు కాంగ్రెస్ శ్వేతపత్రాలతో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరన్నారు.
కాంగ్రెస్ హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తుందని, నిబద్ధతతో మాట నిలబెట్టుకోవడం..అబద్ధాలు ..అసత్యాలు చెప్పి గెలిచినంత ఈజీ కాదన్నారు. చిత్తశుద్ధి లేనప్పుడు వంచన బుద్ధిని ప్రదర్శించడం కాంగ్రెస్ కు అలవాటే అన్నారు. అప్పుల ముచ్చట్లు చెప్పి ఆరు గ్యారెంటీలను నీరుగార్చాలన్నది కాంగ్రెస్ అసలు ప్లాన్ అని ఆరోపించారు.
వందరోజుల్లో నెరవేరుస్తామని చెప్పిన హామీలను ఎట్లా బొందపెట్టాలన్న ఎత్తుగడల్లో భాగమే కాంగ్రెస్ నాటకాలని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని కథలు చెప్పినా.. మీరు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేదాకా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ప్రజలు అడిగేది శ్వేతపత్రాలు కాదని.. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీల అమలు అన్నారు. కాకిలెక్కలతో కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే.. తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయమన్నారు.