Harish Rao: 'ఒకరికి మంచి చేసి వేరొకరి కడుపు కొట్టొద్దు' - ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15 వేల భృతి ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్
Telangana News: రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. నెలకు రూ.15 వేల భృతి ఇవ్వాలని అన్నారు.
Harish Rao Comments on Auto Drivers Problems: రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద ఆటో డ్రైవర్లను ప్రభుత్వం నడిరోడ్డుపై వదిలేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. సిద్ధిపేట ఆటో క్రెడిట్ కో ఆపరేట్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం ఆటో డ్రైవర్లకు నిర్వహించిన ఆటల పోటీల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్యలపై స్పందించారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15 వేల భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తామని అన్నారు. దాదాపు 1480 మంది ఆటో డ్రైవర్లకు ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నారని.. వీరికి ఆటల పోటీలు నిర్వహించడం రాష్ట్రానికే ఆదర్శమని పేర్కొన్నారు. పట్టణానికే వారు బ్రాండ్ అంబాసిడర్లని.. సిద్దిపేటకు వచ్చే అతిథులను గౌరవ మర్యాదలతో గమ్య స్థానాలకు చేరుస్తున్నారని కొనియాడారు. అప్పుడప్పుడూ ఆటలు ఆడడం ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని చెప్పారు. సిద్ధిపేట స్పోర్ట్స్ హబ్ గా మారిందని అన్నారు.
వీరి కడుపు కొట్టొద్దు
ఒకరికి మంచి చేయాలనే ఉద్దేశంతో.. వేరొకరి కడుపు కొట్టొద్దని హరీష్ రావు ప్రభుత్వానికి సూచించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మంచి కార్యక్రమమే అయినా.. ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని వారిని ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల పిల్లల చదువులు, ఆరోగ్యానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అలాగే, ఉచిత బస్సు ప్రయాణం వల్ల రద్దీ పెరిగిందని మారుమూల గ్రామాలకు సైతం బస్సు సౌకర్యం పెంచాలని కోరారు.
Also Read: TSSPDCL: సంక్రాంతికి పతంగులు ఎగరేస్తున్నారా? - ప్రజలకు TSSPDCL సీఎండీ విజ్ఞప్తి
- సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీ. అయితే, పిల్లలు పతంగులు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో ఓ బాలుడు పతంగులు ఎగరేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పిల్లల పట్ల పెద్దలు అప్రమత్తంగా వ్యవహరించాలని TSSPDCL సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మైదానాలు, సువిశాల ప్రదేశాల్లో పతంగులు ఎగురవేయాలని.. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద గాలిపటాలు ఎగరెయ్యొద్దని హెచ్చరించారు.