TSSPDCL: సంక్రాంతికి పతంగులు ఎగరేస్తున్నారా? - ప్రజలకు TSSPDCL సీఎండీ విజ్ఞప్తి
Telangana News: పతంగులు ఎగరేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని TSSPDCL ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని.. విద్యుత్ తీగల వద్ద గాలిపటాలు ఎగరేయ వద్దని హెచ్చరించింది.
TSSPDCL CMD Precautions to People While Flying Kites: సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీ. అయితే, పిల్లలు పతంగులు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో ఓ బాలుడు పతంగులు ఎగరేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పిల్లల పట్ల పెద్దలు అప్రమత్తంగా వ్యవహరించాలని TSSPDCL సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మైదానాలు, సువిశాల ప్రదేశాల్లో పతంగులు ఎగురవేయాలని.. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద గాలిపటాలు ఎగరెయ్యొద్దని హెచ్చరించారు. అలా చేస్తే పతంగుల మాంజాలు వాటిపై పడి ప్రమాాదాలు జరుగుతాయని తెలిపారు. అంతే కాకుండా విద్యుత్ అంతరాయాలు కూడా కలిగే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి, జాగ్రత్తలతో పతంగులు ఎగరేయాలని సూచించారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా, బహిరంగ ప్రదేశాల్లో, మైదానాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయండి.
-
విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్ల వద్ద ఎగురవేయడం ప్రమాదకరం. ఒక వేళ పతంగులు కానీ, మాంజాలు కానీ విద్యుత్ లైన్లపై, ఇతర విద్యుత్ పరికరాలపై పడితే విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది
-
కాటన్, నైలాన్, లినెన్ తో చేసిన మాంజాలను మాత్రమే వాడండి. మెటాలిక్ మాంజాలు వాడొద్దు. మెటాలిక్ మాంజాలు విద్యుత్ వాహకాలు కనుక అవి లైన్లపై పడ్డప్పుడు విద్యుత్ షాక్ తగిలే అవకాశం ఉంది.
-
పొడి వాతావరణంలో మాత్రమే పతంగులు ఎగురవేయాలి. తడి వాతావరణంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ.
-
పతంగులు కానీ, మాంజాలు కానీ విద్యుత్ లైన్లపై, ఇతర విద్యుత్ పరికరాలపై పడ్డప్పుడు వాటిని అలాగే వదిలేయండి. వాటిని తీయాలని ప్రయత్నిస్తే.. విద్యుత్ తీగలు ఒకదానికొకటి రాసుకుని విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
-
బాల్కనీ/ గోడల మీద నుంచి పతంగులు ఎగురవేయరాదు. అలా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పతంగులు ఎగురవేసేటప్పుడు పిల్లలను గమనిస్తూ ఉండాలి. పిల్లలను తెగిన, కింద పడ్డ విద్యుత్ వైర్లను తాకనివ్వొద్దు.
-
ఒక వేళ విద్యుత్ వైర్లపై, విద్యుత్ పరికరాలపై పతంగులు/మాంజాలు తెగి పడ్డట్లు ఉంటే, విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డట్టు ఉన్నా, వాటిని తాకకుండా వెంటనే విద్యుత్ శాఖ 1912కి సమాచారం అందించాలి. లేదా సమీప విద్యుత్ కార్యాలయానికి గానీ లేదా సంస్థ మొబైల్ యాప్ ద్వారా లేదా సంస్థ వెబ్ సైట్ www.tssouthernpower.com ద్వారా తెలియజేయగలరు. విద్యుత్ సిబ్బంది వెంటనే తగు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
విద్యుత్ షాక్ తో బాలుడు మృతి
సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ (Hyderabad) లో విషాదం జరిగింది. గాలిపటం ఎగరేస్తూ ఓ బాలుడు విద్యుత్ షాక్ తో ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ (Rajendra Nagar) పరిధి అత్తాపూర్ (Athapur)లో ఈ విషాద ఘటన శనివారం జరిగింది. ఇంటి మేడపై తన స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరేయడానికి వెళ్లిన తనిష్క్ (11) పతంగి ఎగరేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి కుప్పకూలాడు. తల్లిదండ్రులు వెంటనే బాలుణ్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.