KTR News: సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు, కేంద్ర మంత్రికి సాక్ష్యాధారాలు ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు
Telangana News | తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి అమృత్ టెండర్లలో అధికార దుర్వినయోగానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ కేంద్ర మంత్రి ఖట్టర్ కు ఫిర్యాదు చేశారు.
BRS leader KTR complaint against Revanth Reddy | హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అమృత్ పథకం టెండర్లలో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ సోమవారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి అమృత్ పథకం టెండర్ల వ్యవహారంలో తన కుటుంబ సభ్యులకు లాభం చేకూర్చేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేంద్ర మంత్రి ఖట్టర్ కు కేటీఆర్ ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను కేంద్ర మంత్రి ఖట్టర్ కు కేటీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ బృందం అందించింది. కేటీఆర్ వెంట ఎంపీలు KR సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, మాజీ ఎంపీలు బాల్క సుమన్, మాలోత్ కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు తదితరులు ఉన్నారు.
రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఫిర్యాదు
బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ అన్నంత పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై పోరాటం చేస్తామని, వారి నిజ స్వరూపాన్ని కేంద్రం ముందు పెడతామన్న కేటీఆర్ సోమవారం ఢిల్లీకి వెళ్లారు. రేవంత్ అవినీతి, అక్రమాలపై కేటీఆర్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అమృత్ పథకం టెండర్లలో తన బావమరిది సృజన్ రెడ్డికి లాభం చేకూర్చేలా సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని గతంలోనే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దృష్టికి బీఆర్ఎస్ తీసుకెళ్లింది. తాజాగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి ఖట్టర్ ను నేరుగా కలిసి కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందం సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో తాను ల్యాండ్ అయితే హైదరాబాద్ లో భూకంపం వచ్చిందంటూ కొన్ని గంటల కింద కేటీఆర్ చేసిన పోస్టుతో తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి.
రేవంత్ అవినీతి, అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్ళిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
— BRS Party (@BRSparty) November 11, 2024
అమృత్ పథకం టెండర్లలో రేవంత్ తన బావమరది సృజన్ రెడ్డికి లాభం చేకూర్చేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఇప్పటికే ఈ విషయం లేఖ ద్వారా కేంద్ర మంత్రి మనోహర్ లాల్…
గతంలో లేఖ, ఇప్పుడు నేరుగా ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్
అమృత్ స్కీమ్ లో భాగంగా కేంద్రం ఇచ్చే నిధులతో చేయించే పనుల టెండర్లలో అవకతవకలు జరిగాయని కేటీఆర్ కొన్ని రోజుల కిందట ఆరోపించారు. లేఖ ద్వారా కేంద్రానికి లేఖ పంపి సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతల్ని సైతం డిమాండ్ చేశారు. మరో అడుగు ముందుకేసి ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్ అమృత్ టెండర్లు సహా ఇతర విషయాలలో ప్రభుత్వ అవినీతి, సీఎం రేవంత్ అధికార దుర్వినియోగంపై కేంద్ర మంత్రులకు, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ నేతలు రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫిర్యాదు, ఢిల్లీ పర్యటనపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
అరెస్టు నుంచి తప్పించుకోవడానికే - కాంగ్రెస్ విమర్శలు
మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ తీసుకున్న నిర్ణయాలపై అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీకి లాబీయింగ్ చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఫార్ములా ఈ రేసులో రూ.50 కోట్ల గల్లంతు వ్యవహారంలో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి ఏసీబీ అధికారులు గవర్నర్ పర్మిషన్ అడిగారని చెప్పారు. బీజేపీ నేతలతో లాబీయింగ్ చేసి తనను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వకుండా చూసుకునేందుకు కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు.