Dasoju Sravan: ప్రజల జీవితాల్లో వెలుగు నింపినందుకా కేసీఆర్‌కు నోటీసులు - రేవంత్కు దాసోజు శ్రవణ్ లేఖ
Dasoju Sravan : తెలంగాణ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపినందుకు కేసీఆర్ కు సంజాయిషీ నోటీసులా అంటూ.. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు.
Dasoju Sravan Letter to CM Revanth Reddy : పగ ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు పరాకాష్టగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఉందని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఆయన పాలన అధ్వాన్నంగా ఉందంటూ శ్రవణ్ విమర్శించారు. విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రానికి మిగులు విద్యుత్తు అందించి వెలుగులు విరజిమ్మే తెలంగాణగా తీర్చిదిద్దినందుకు కేసీఆర్ కు సంజాయిషీ నోటీసులు జారీ చేస్తారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినందుకు కేసీఆర్ కు సంజాయిషీ నోటీసులా అని ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు.
డైవర్షన్ పాలిటిక్స్ వద్దు
ఎంత ఖర్చైనా కోతలు లేని కరెంట్ ఇచ్చినందుకా నోటీసులు.. ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు నిరంతర విద్యుత్తు సరఫరా చేసి, అభివృద్ధికి దారితీసినందుకు కేసీఆర్ కు పంపించారా సంజాయిషీ నోటీసులు అని అన్నారు. కాస్త ప్రతీకార రాజకీయాలను పక్కనబెట్టి, ప్రజాసంక్షేమానికి కృషి చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి దాసోజు శ్రవణ్ హితవు పలికారు. గత ప్రభుత్వంలో లాగా 24 గంటల పాటు కోతల్లేని విద్యుత్తు సరఫరా చేయాలని ప్రజలను డిమాండ్ చేస్తున్నట్లు దాసోజు శ్రవణ్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, అభివృద్ధిని అడ్డుకునే మీ దుష్ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో వెలుగులు విరజిమ్మిన రాష్ట్రం, కరెంట్ లోటుతో సతమతమవుతున్న ప్రస్తుత పరిస్థితిని మీ ప్రతీకార రాజకీయాలతో మరింత కష్టతరం చేయడం సరికాదన్నారు. హామీల అమలు చేతకాని గుంపు మేస్త్రీగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ సంజాయిషీల ప్రతీకార రాజకీయాలకు పాలిటిక్స్ చేస్తూ సంజాయిషీల ప్రతీకార రాజకీయాలకు తెరలేపారంటూ మండిపడ్డారు.
కేసీఆర్ ను బద్నాం చేసే ప్రయత్నాలు
రుణ మాఫీ, రైతు భరోసా, ఉద్యోగాలు, నాలుగు వేల రూపాయల పెన్షన్, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు, మహిళకు 2500 రూపాయలు లాంటి పథకాలు అమలు చెయడం చేతకాక కేసీఆర్ ను బద్నాం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తక్షణం రాజకీయ కుయుక్తులను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఆలోచనలు, కృషిని కేంద్రీకరించాలన్నారు. మీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ఆకాంక్షలను, వారి అభివృద్ధిని అణగదొక్కే ప్రయత్నాలను విమరించుకోవాలని సూచించారు.
ఇందుకే నోటీసులు
బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జస్టిస్ నరసింహా రెడ్డి నేతృత్వంలోని కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయన పదవీకాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో (పీపీఏ) తన ప్రమేయంపై వివరణ కోరుతూ నోటీసు జారీ చేసింది. జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలంటూ కమిషన్ సూచించింది. దీనిపై స్పందించిన కేసీఆర్ జులై 30 వరకు గడువు కావాలంటూ విజ్ఞప్తి చేశారు. కానీ సమయం ఇచ్చేందుకు కమిషన్ అంగీకరించలేదు.