KCR: ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన కేసీఆర్ - గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆ రోజునే గులాబీ బాస్ ప్రమాణం
KCR Oath: తుంటి ఎముక గాయం నుంచి కోలుకుంటున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
KCR Oath as Gajwel Mla on Febrauary 1st: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) త్వరలోనే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తుంటి ఎముక గాయం నుంచి ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఫామ్ హౌస్ లో గాయపడిన కేసీఆర్ కు వైద్యులు సర్జరీ నిర్వహించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు గత 2 నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు చేతి కర్ర సాయంతో నెమ్మదిగా నడుస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో గజ్వేల్ (Gajwel) నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుటికీ గాయం కారణంగా ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే, ఫిబ్రవరి 1న స్పీకర్ గడ్డం ప్రసాద్ (Gaddem Prasad) ఛాంబర్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో 45,031 ఓట్ల తేడాతో గెలిచారు. అలాగే, కామారెడ్డి స్థానం నుంచి కూడా పోటీ చేసిన కేసీఆర్, బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు.
ఇటీవల ఎంపీలతో సమావేశం
కాగా, రాబోయే పార్లమెంటరీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఇటీవలే సమావేశమైంది. సిద్దిపేట (Siddipeta) జిల్లా ఎర్రవల్లిలోని (Erravalli) ఫాం హౌస్ లో పార్టీ అధినేత కేసీఆర్ (KCR) నేతృత్వంలో ఈ భేటీ జరగ్గా.. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్ సభాపక్షనేత నామా నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు, కేటీఆర్, హరీష్ రావులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహాలు, వైఖరిపై ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. కాగా, ఈ నెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యి, ఫిబ్రవరి 9 వరకూ కొనసాగుతాయి. రాబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా.. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారు.
'మన గళం వినిపించాలి'
సర్జరీ అనంతరం తొలిసారిగా ఎంపీలతో సమావేశమైన కేసీఆర్ వారికి పలు కీలక సూచనలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పని చేసేది బీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ అన్నారు. పార్లమెంట్ లో మన గళం వినిపించాలని ఎంపీలకు సూచించారు. 'విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి గట్టిగా ప్రశ్నించాలి. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలి. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం. ఆపరేషన్ మాన్యువల్, ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడుదాం. త్వరలోనే నేను ప్రజల్లోకి వస్తా.' అంటూ వ్యాఖ్యానించారు. ఓవైపు, లోక్ సభ ఎన్నికల కోసం శ్రేణులను సమాయత్తం చేస్తూనే.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సమావేశాల్లో శ్రేణులు, నేతలకు సూచనలిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో సమావేశాలు జరగనున్నాయి.
Also Read: KCR Politics: కేసీఆర్ ఇప్పటికింతే! బీఆర్ఎస్ తెలంగాణకే పరిమితం, దేశంలో ప్రభావం లేనట్టే!