KCR: 'ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే?' - రైతులు, చేనేతల్ని ప్రభుత్వం ఆదుకోకుంటే వెంట పడతామని గులాబీ బాస్ వార్నింగ్
Telangana News: తెలంగాణలో నీటి నిర్వహణ తెలియని వారు రాజ్యం ఏలుతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం వైఫల్యం వల్లే పంటలు ఎండిపోయాయని.. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Kcr Slams Congress Government: కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఇది కాలం తెచ్చిన కరువా.?, కాంగ్రెస్ తెచ్చిన కరువా.? అంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో శుక్రవారం ఎండిన పంటలును పరిశీలించిన ఆయన.. సిరిసిల్లలోని (Siricilla) తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపు అన్ని పంటలు ఎండిపోయాయని.. రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. రాష్ట్రంలో 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. నీటి నిర్వహణపై ఈ సర్కారుకు సరైన అవగాహన లేదు. నాణ్యమైన విద్యుత్ అందక మోటార్లు కాలిపోతున్నాయి. వర్షపాతం లేక పంటలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కానీ, ప్రభుత్వ వైఫల్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయి. హస్తం పాలనలో అన్న వస్త్రం కోసం పోతే.. ఉన్న వస్త్రం ఊడినట్లుగా ఉంది. నూతన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని 4 నెలలు ఆగాం. ఇక ఊరుకునేది లేదు. రైతులు, చేనేత కార్మికుల్ని ఆదుకోకుంటే ఊరుకునేది లేదు.' అంటూ ప్రభుత్వానికి గులాబీ బాస్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రభుత్వానికి డిమాండ్
కాంగ్రెస్ హామీ ఇచ్చిన విధంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇచ్చి పండించిన అన్ని పంటలు కొనాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ pic.twitter.com/r7xovudxRS
— BRS Party (@BRSparty) April 5, 2024
అత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేలు ఇవ్వాల్సిందే.
— BRS Party (@BRSparty) April 5, 2024
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ pic.twitter.com/dlJz5pxytX
రాష్ట్రంలో వంద రోజుల్లోనే 209 మంది రైతులు చనిపోయారని.. 48 గంటల్లో లిస్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు అడిగితే 4 గంటల్లోనే సీఎస్ కు వివరాలు పంపామని కేసీఆర్ అన్నారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి. ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి. పదేళ్ల క్రితం చేనేత కార్మికుల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అలానే తయారైంది. బీఆర్ఎస్ హయాంలో చేనేతే కార్మికుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. చేనేతలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. కాంగ్రెస్ మోసపూరిత హామీలు చూసి ప్రజలు మోసపోయారు. గత వేసవిలో 14,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా జరిగింది. ఈసారి గతేడాది కంటే 700 యూనిట్లు మాత్రమే అదనంగా వచ్చింది. కాళేశ్వరం వీలైనంత త్వరగా పూర్తి చేసి నీళ్లివ్వాలని ఆరాటపడ్డాం. 6 నెలల్లో ప్రాజెక్ట్ రూపకల్పన చేశాం. అందులో 3 పిల్లర్లు కుంగిపోతే.. మొత్తం మునిగిపోయినట్లు ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం డిజైన్ల విషయంలో కాంగ్రెస్ నేతలకు తెలివి లేదు. బీఆర్ఎస్ హయాంలో ఇంటింటికీ నల్లాల ద్వారా నీరు సరఫరా చేశాం. ఇవాళ మళ్లీ నడిరోడ్డుపై బిందెలతో నీటి కోసం జనం ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథను నడిపే తెలివి వీళ్లకు లేదు.' అని కేసీఆర్ ధ్వజమెత్తారు.
10 వేల మందితో ధర్నా
కాంగ్రెస్ హయాంలో మళ్లీ చేనేతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయని కేసీఆర్ మండిపడ్డారు. 'బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ తోఫా వంటి వాటితో వారికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాం. ఒకప్పుడు భూదాన్ పోచంపల్లిలో ఏడుగురు చేనేత కార్మికులు ఒకేసారి చనిపోయారు. అప్పుడు చంద్రబాబు అనే వ్యక్తి సీఎంగా ఉన్నారు. ఆ కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా అడిగితే ఇవ్వలేదు. అప్పుడు రూ.7.5 లక్షలు సేకరించి బాధిత కుటుంబాలకు అందించాం. చేనేత కార్మికులు వారి సమస్యలపై శనివారం 10 వేల మందితో ధర్నా తలపెట్టారు. ఈ ఆందోళనకు మా పార్టీ నాయకులు హాజరవుతారు. వాళ్లకు అండగా ఉంటాం.' అని కేసీఆర్ పేర్కొన్నారు.