BRS BSP Alliance : బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు ఖరారు - నాగర్‌కర్నూలు నుంచి పోటీ చేయనున్న ఆర్ఎస్ ప్రవీణ్ ?
BRS BSP Alliance : బీఆర్ఎస్ బీఎస్పీ లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి . ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
BRS BSP decided to contest the Lok Sabha elections together : తెలంగాణ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. భారత రాష్ట్ర సమితి.. బహుజన సమాజ్ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ .. కేసీఆర్ తో సమావేశం అయ్యారు. కలసి పని చేయడంపై చర్చించారు. పొత్తులు పెట్టుకోవాలని నిర్ణయంచుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
బీఎస్పీకి కొన్ని సీట్లు కేటాయిస్తాం : కేసీఆర్
లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో భేటీ తర్వాత కేసీఆర్ ప్రకటించారు. బుధవారం బీఎస్పీ చీఫ్ మాయావతితో మాట్లాడతానని తెలిపారు. పొత్తు విధి విధానాలను త్వరలోనే ఖరారు చేస్తామని బీఎస్పీకి కొన్ని సీట్లను కేటాయిస్తామన్నారు.
తెలంగాణను కాపాడేందుకే పొత్తులు : ప్రవీణ్
కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు ముప్పు ఏర్పడిందని.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాజ్యాంగానికి ఈ రెండు పార్టీలు తూట్లు పొడుస్తున్నాయన్నారు. వీటి నుంచి తెలంగాణను కాపాడుకోవడానికే పొత్తులు పెట్టుకున్నామని.. అన్ని విషయాలు త్వరలోనే తెలియ చేస్తామన్నారు. - కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ దేశంలో కట్టడి చేయాల్సిన అవసరం ఉందని..
మా స్నేహం తెలంగాణ ను పూర్తిగా మారుస్తుందని ప్రవీణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగు నెలలు కాకముందే కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చిందన్నారు.
సిర్పూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన ప్రవీణ్ కుమార్
ఐపీఎస్ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్ కుమార్ బీఎస్పీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుని విస్తృతంగా పర్యటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనంత వరకూ గట్టి అభ్యర్థులనే నిలబెట్టారు. తను జనరల్ నియోజకవర్గం అయిన సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒక్క ఎమ్మెల్యే కూడా బీఎస్పీ తరపు నుంచి నెగ్గలేదు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ భవిష్యత్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పొత్తు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రెండు పార్టీలకు ఉభయతారకంగా ఉంటుందన్న అబిప్రాయంతో ముందడుగు వేసినట్లుగా తెలుస్తోంది.
పొత్తులు పెట్టుకోక తప్పని పరిస్థితి లో బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ పొత్తులకు వ్యతిరేకం. గతంలో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుంటామని మాట ఇచ్చినా చివరికి హ్యాండిచ్చారు. ఒక్క మజ్లిస్ పార్టీతో మాత్రమే.. తెర వెనుక సహకారం ఉండేది. ఇప్పుడు మజ్లిస్ కూడా దూరమయింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు పెరిగాయి. సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారుతున్నారు. బీఎస్పీతో పొత్తులు పెట్టుకోవడం మంచిదన్న అభిప్రాయానికి కేసీఆర్ వచ్చారు. ఎన్ని స్థానాలు కేటాయిస్తారన్నది రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.