Pushpa 2 Stampede: 'మా బాబుని అంతా పుష్ప అని పిలిచేవారు' - ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నాడంటూ ఆ తండ్రి ఆవేదన
Hyderabad News: తమ బిడ్డ అల్లు అర్జున్ ఫ్యాన్ అని.. అతని కోసమే సినిమాకు వచ్చామని తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడి తండ్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. భార్య మృతితో ఆయన కన్నీరు మున్నీరయ్యారు.
Pushpa 2 Benefit Show Stampede In Hyderabad Sandhya Theatre: పుష్ప 2 (Pushpa 2) బెనిఫిట్ షో ఓ కుటుంబంలో విషాదం నింపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురువారం విడుదల కాగా.. బుధవారం రాత్రి నుంచి ప్రధాన నగరాల్లో బెనిఫిట్ షో వేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌లో (Sandhya Theatre) బుధవారం జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. వారిలో చిన్నారి శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉంది. తన భార్య మృతిపై మృతురాలి భర్త భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడుకు పరిస్థితి విషమంగా ఉండడంతో మరింత విషాదంలో మునిగిపోయారు.
'మా బాబు కోసమే సినిమాకు వచ్చాం'
తమ బిడ్డ అల్లు అర్జున్ ఫ్యాన్ అని వాడి కోసమే సినిమాకు వచ్చినట్లు భాస్కర్ కన్నీటితో చెప్పారు. 'అందరూ మా బాబుని పుష్పా అని పిలుస్తారు. కానీ మా భార్యను కోల్పోవడం తట్టుకోలేక పోతున్న. పోలీసులు CPR చేసినప్పుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు. అప్పటికి అభిమానులు మాములుగా ఉన్నారు. ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది. తొక్కిసలాట జరిగింది. మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు.' అని పేర్కొన్నారు. మరోవైపు, ఇప్పటికీ ఈ ఘటనపై అల్లు అర్జున్ స్పందించలేదని.. వెంటనే ఆయన స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
స్పందించిన బన్నీ టీమ్
అటు, ఈ ఘటనపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సహా బన్నీ టీం స్పందించింది. ఇది ఎంతో విషాదకర ఘటన అని.. దీని పట్ల తాము చాలా విచారం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించింది. చికిత్స పొందుతున్న బాలుడు క్షేమంగా బయటపడాలని కోరుతున్నట్లు తెలిపింది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించింది.
అసలేం జరిగిందంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదల కాగా.. బుధవారం ప్రధాన నగరాల్లో బెనిఫిట్ షోలు వేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్దకు బుధవారం రాత్రి పెద్ద ఎత్తున అభిమానులు షో చూసేందుకు తరలివచ్చారు. అందరి మాదిరిగానే దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భాస్కర్ తన భార్య రేవతి, పిల్లలు శ్రీతేజ, సన్వీకతో కలిసి సినిమాకు వెళ్లారు. అయితే, షో ప్రారంభానికి ముందే థియేటర్‌కు అల్లు అర్జున్ రావడంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో తోపులాట చోటు చేసుకోగా తొక్కిసలాటలో భాస్కర్ ఫ్యామిలీ ఇరుక్కుంది.
జనాన్ని కంట్రోలే చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో జనం పరుగులు తీశారు. ఈ కారణంగా భాస్కర్ ఫ్యామిలీ కింద పడిపోయింది. ఆ విషయాన్ని పట్టించుకోని అల్లు అర్జున్ అభిమానులు వారిని తొక్కుకుంటూ వెళ్లిపోయారు. ఈ తొక్కిసలాటలో రేవతి తీవ్రంగా గాయపడింది. ఆమెతో ఉన్న కుమారుడు శ్రీ తేజ్ కూడా గాయాలపాలయ్యాడు. రేవతి, శ్రీతేజ్‌ను అతి కష్టమ్మీద పోలీసులు బయటకు తీసుకొచ్చారు. అప్పటికే వాళ్లిద్దరు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే వారిని దగ్గర్లోనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ రేవతి కన్నుమూశారు. కుమారుడు శ్రీతేజ్‌కు కిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Nizamabad News: బైక్‌తో రైలుకు ఎదురెళ్లాడు - గేట్ మ్యాన్ స్పందనతో ప్రాణాలు దక్కాయి, కట్ చేస్తే!