Nizamabad News: బైక్‌తో రైలుకు ఎదురెళ్లాడు - గేట్ మ్యాన్ స్పందనతో ప్రాణాలు దక్కాయి, కట్ చేస్తే!
Telangana News: ఓ వ్యక్తి పట్టాలపై వస్తోన్న రైలుకు బైక్‌తో ఎదురెళ్లి ఆత్మహత్యకు యత్నించాడు. స్పందించిన గేట్ మ్యాన్ అతన్ని పక్కకు లాగి రక్షించాడు. దీనిపై రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Man Rides Bike On Railway Track In Navipet: ఓ వ్యక్తి రైలు పట్టాలపై రైలు వస్తుండగా బైక్‌తో ఎదురెళ్లాడు. గమనించిన గేట్ మ్యాన్ లోకో పైలట్‌కు సమాచారం అందించగా రైలును అరగంటసేపు నిలిపేశారు. ఆర్పీఎఫ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన నిజామాబాద్ జిల్లా (Nizamabad District) నవీపేట్‌లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని నవీపేట్ మండల కేంద్రంలో నివాసం ఉండే జగదీష్ అనే వ్యక్తి ఇటీవలే గల్ఫ్ నుంచి తిరిగివచ్చాడు. తన భార్యతో కలహాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే షిరిడి నుంచి తిరుపతి వెళ్తున్న సాయినగర్ ఎక్స్‌ప్రెస్ ట్రాక్‌పై వస్తుండగా రైలుకు బైక్‌తో ఎదురెళ్లాడు. అతన్ని గమనించిన గేట్ మ్యాన్ లోకో పైలెట్‌కు సమాచారం అందించాడు. దీంతో రైలును అరగంట పాటు ఆపేశారు.
స్థానికుల సాయంతో గేట్ మ్యాన్ జగదీశ్‌ను పట్టాల నుంచి పక్కకు లాగి రైల్వే పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. రైల్వే ట్రాక్స్‌పై ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బైక్ రైలు కింద పడితే రైలు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉండేవని.. గేట్ మ్యాన్ సమయ స్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిందన్నారు. రైల్వే ట్రాక్స్ వెంబడి ఇలాంటి ఘటనలపై నిఘా పెడతామని చెప్పారు.