Eetela Rajendar: స్థిరాస్తి దళారి చెంప చెళ్లుమనిపించిన బీజేపీ ఎంపీ ఈటల - ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Medchal News: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై చేయి చేసుకున్నారు. భూములు కబ్జా చేశాడని బాధితుల ఫిర్యాదుతో అతని చెంప చెళ్లుమనిపించారు. మేడ్చల్ జిల్లా పోచారంలో ఈ ఘటన జరిగింది.

BJP MP Eetela Rajendar Attack On Real Estate Agent: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eetela Rajendar) ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా (Medchal District) పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్‌లో మంగళవారం పర్యటించిన ఆయన.. పేదల భూములు బ్రోకర్ కబ్జా చేసినట్లు నిర్ధారణ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దళారి చెంప చెళ్లుమనిపించారు. దీంతో అక్కడ ఉన్న ఆయన అనుచరులు, స్థానికులు సదరు దళారిపై దాడికి దిగారు. ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఎంపీ మండిపడ్డారు.
'పోలీసులు, అధికారుల కుమ్మక్కు'
కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారని ఎంపీ ఈటల మండిపడ్డారు. దళారులతో పోలీసులు, అధికారులు కుమ్మక్కువుతున్నారని.. బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కూల్చివేతలు తప్ప పేదల కన్నీళ్లు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కొనుక్కున్న పేదల సమస్యలపై కలెక్టర్, సీపీతో మాట్లాడినట్లు తెలిపారు. 'నేను ఇక్కడికి పోతున్నా అని మంత్రికి, పోలీసులకు చెప్పి వచ్చా. నేను ఇక్కడ ఉండగా కూడా వారి గూండాలు బెదిరింపులకు దిగారు. ఎంపీకి చెప్తారా మీ సంగతి చెప్తాం అని బెదిరిచారట. పోలీసుల్లారా మీరు ఎవరికి మద్దతు తెలుపుతున్నట్లు. మీకు గౌరవం లేకుండా పోయింది. ప్రజలకు మీరు రక్షణ కలిపించకపోతే మేమే మా చేతుల్లోకి తీసుకుని ఇక్కడ ఉన్న గూండాలను పారద్రోలతాం.' అని ఈటల మండిపడ్డారు.
భూముల కబ్జాలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారని ఈటల తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల పేదల ఖాళీ స్థలాలను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పోలీసులు, రెవెన్యూ అధికారుల అండదండలతో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. అరుంధతినగర్, బాలాజీనగర్, జవహర్‌నగర్‌లో ఇలానే చేస్తే తానే స్వయంగా వెళ్లి వచ్చినట్లు చెప్పారు. పేదలు ఇళ్లు కట్టుకుంటే గూండాలు వచ్చి కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Davos Tour: దావోస్‌లో ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్ ప్రారంభం.. హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి





















