Eatala Rajender: ఈటలపై అధిష్ఠానం సీరియస్ అయిందా? రాజాసింగ్ ఇంటికి వెళ్లడమే కారణమా?
కొద్ది రోజుల క్రితం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మంత్రి హరీష్ రావును కలిసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన బీజేపీని వీడబోతున్నారని ప్రచారం సాగింది.
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పైన బీజేపీ అధిష్ఠానం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. నేడు (జూలై 19) ఆయన ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ విషయమే అధిష్ఠానానికి నచ్చలేదని సమాచారం. రాజాసింగ్ ను కొద్ది నెలల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలా సస్పెండ్ అయిన రాజాసింగ్ ఇంటికి వెళ్ళి కలవడం సరికాదంటూ ఈటలకు అధిష్ఠానం హితవు పలికినట్లుగా వార్తలు వస్తు్న్నాయి. ఒక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినందుకు గానూ గత ఆగస్టులో రాజాసింగ్ సస్పెన్షన్ కు గురయ్యారు.
కొద్ది రోజుల క్రితం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మంత్రి హరీష్ రావును కలిసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన బీజేపీని వీడబోతున్నారని ప్రచారం సాగింది. అందుకే రాజాసింగ్ ఇంటికి బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ వెళ్లి బుజ్జగించినట్లుగా వార్తలు వచ్చాయి. గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఈటల దృష్టికి రాజాసింగ్ తీసుకెళ్లారు. తనపై హైకమాండ్ విధించిన సస్పెన్షన్‌పై ఈటలతో రాజాసింగ్ చర్చించారు. సస్పెన్షన్ ఎత్తివేసేలా అధిష్టానాన్ని కోరతానని రాజసింగ్‌కు ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.
రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత వ్యవహారం కేంద్ర అధిష్ఠానం పరిధిలో ఉందని.. సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో వారు త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానని ఈటల అన్నారు. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తి వేయకపోతే సొంత పార్టీ పెట్టుకోవడం లేదా ఉద్దవ్ థాకరే శివసేన పార్టీని తెలంగాణలో ఏర్పాటు చేసి.. అభ్యర్థిగా పోటీ చేయడం వంటి అవకాశాలను పరిశీలిస్తున్నారని అంటున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఇవాళ కాకపోతే రేపైనా సస్పెన్షన్ ఎత్తి వేస్తారని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని రాజాసింగ్ కు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కార్యకర్తలకు హామీ
బోనాల పండగ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతల గొడవలో చిక్కుకున్న మంగళ్ హాట్ కార్పొరేటర్ శశికళను కూడా ఈటల రాజేందర్ పరామర్శించారు. బీఆర్ఎస్‌తో ఫ్లెక్సీ గొడవపై కార్పొరేటర్ శశికళను ఈటల రాజేందర్ అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ఈటల తెలిపారు. బీజేపీ నాయకులపై నమోదైన కేసులపై పోలీస్ అధికారులతో మాట్లాడుతాననని ఈటల తెలిపారు.
సస్పెన్షన్ ఎత్తి వేయకపోవడంతో రాజాసింగ్‌లో అసంతృప్తి
సస్పెన్షన్ ఎత్తి వేస్తారో లేదో నన్న కంగారులో రాజాసింగ్ ఉన్నారు. ఆయన ఓ సారి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం కూడా జరిగింది. ఇటీవల మంత్రి హరీష్ రావు ఇంటికి వెళ్లి మాట్లాడిన వీడియో కూడా వైరల్ అయింది. ఇతర పార్టీల నేతల్ని కలిసినప్పుడల్లా ఆయన పార్టీ మారడానికి రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ రాజాసింగ్ మాత్రం.. తాను బీజేపీకే కరెక్ట్ అని ఇతర పార్టీల్లో ఇమడలేనని ఓ సందర్భంలో చెప్పారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ రాజాసింగ్ ఇంటికి వెళ్లి సమావేశం కావడంతో.. ఆయన పక్క చూపులు చూడవద్దని బుజ్జగించడానికేనని అంటున్నారు.