Srirama Navami 2022 : భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, రెండేళ్ల తర్వాత కన్నుల పండగగా వేడుకలు
Srirama Navami 2022 : గత రెండేళ్లుగా కరోనా కారణంగా భద్రాచలం రాములోరి కల్యాణానికి భక్తులను అనుమతించలేదు. కరోనా తగ్గడంతో ఈ ఏడాది భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవమి ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ సమీక్షించారు.
![Srirama Navami 2022 : భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, రెండేళ్ల తర్వాత కన్నుల పండగగా వేడుకలు Bhadrachalam Srirama Navami 2022 Brahmostavas ministe puvvada ajay kumar review on preparations Srirama Navami 2022 : భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, రెండేళ్ల తర్వాత కన్నుల పండగగా వేడుకలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/04/ff9f51a482a47488d6053587dbc496a6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bhadrachalam Srirama Navami 2022 : భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. శ్రీరామనవమి ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ సోమవారం అధికారులతో సమీక్షించారు. రెండో అయోధ్యగా పేరొందిన ఖమ్మం జిల్లా భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ నెల 10న జరిగే శ్రీరామనవమికి స్వామివారి కల్యాణ ఉత్సవం, ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయలో జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులు, పోలీసు, పంచాయతీ రాజ్, విద్యుత్, రవాణా, గ్రామ పంచాయతీ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, ఫైర్, రెవెన్యూ, ఎండోమెంట్ శాఖల అధికారులు, ఆలయ అర్చకులతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 02 నుంచి 16వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది పెద్ద సంఖ్యలో రానున్న భక్తులు
ఏప్రిల్ 10వ తేదీన శ్రీరాముల వారి కల్యాణం, 11న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై జిల్లా కలెక్టర్ అనుదీప్ ను ఆయా వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. సీతారామ కల్యాణమహోత్సవాన్ని తిలకించేందుకు దూర ప్రాంతాల నుండి తరలివచ్చే అశేష భక్తజన కోటికి సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా స్వామి వారి కల్యాణానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించినందున, ఈ సారి లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున 3 లక్షల స్వామివారి ప్రసాద లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక వసతి, మరుగుదొడ్లు, ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని మంత్రి పువ్వాడ సూచించారు.
ప్రసార మాధ్యమాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయండి
పార్కింగ్ ప్రాంగణాలు దూర ప్రాంతాలలో కాకుండా సాధ్యమైనంత దగ్గరగా ఉండేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. భక్తుల కోరిక మేరకు తలంబ్రాలు విరివిగా అందుబాటులో ఉండేలా ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని కోరారు. బ్లీచింగ్ ను ఎప్పటికప్పుడు జల్లుతూ పరిశుభ్రత పాటించాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ను ఉచితంగా అందించాలని అన్నారు. ప్రత్యక్షంగా స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు రాలేని వారికోసం వారధిగా ఉన్న మీడియాకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రసార సదుపాయాలు కల్పించాలన్నారు. భక్తులు సులువుగా కల్యాణ ప్రాంగణాన్ని చేరుకునేలా ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ అప్రమత్తంగా ఉండాలన్నారు.
భద్రతకు అదనపు బలగాలు
నిర్దేశించిన పనులన్నీ ఏప్రిల్ 8వ తేదీ నాటికి పూర్తిచేయాలని, మిథిలా స్టేడియంలో, మూడవీధులు, స్వామివారి కల్యాణ మండపం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాల ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భక్తుల తాకిడి అధికంగా ఉండనున్న నేపథ్యంలో అవసరమైతే వీవీఐపీ భద్రత కోరకు CRPF బలగాలను వినియోగించుకోవాలని, వరంగల్, ఖమ్మం జిల్లా పోలీసులను కూడా వినియోగించుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా పలు సూచికలు, కల్యాణం ప్రాంగణ వివరాలు, వివిధ సేవలకు సంబందించిన పలు అంశాలతో రూపొందించిన కరపత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం స్వామివారి కల్యాణం జరిగే చోటు మిథిలా ప్రాంగణాన్ని మంత్రి పువ్వాడ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)