Balagam Question: కానిస్టేబుల్ పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న, డైరెక్టర్ వేణు ఏమన్నారంటే!
Balagam Question: తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కానిస్టేబుల్ రాత పరీక్షలో బలగం సినిమా గురించి ప్రశ్న అడిగారు.
Balagam Question: తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి తుది రాత పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. ఆదివారం కానిస్టేబుల్ స్థాయిలో శాంతిభద్రతలు, ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగం పరీక్షలతో ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 183 కేంద్రాల్లో ఉదయం 10 గంటలకు నిర్వహించిన లా అండ్ ఆర్డర్ విభాగం పరీక్షలకు 1,09,663 మందికి గాను 1,08,055 మంది హాజరయ్యారు. ఐటీ అండ్ కమ్యూనికేషన్ పరీక్షలకు 89.52 మంది హాజరయ్యారు. పరీక్షల ప్రాథమిక కీని త్వరలోనే విడుదల చేస్తామని టీఎస్ఎల్పీఆర్బీ ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
బలగం సినిమాపై ప్రశ్న..
బలగం మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో, ప్రజల నుండి ఎంత ఆదరణ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ యాక్టర్, కమెడియన్ వేణు ఎల్దండి మొదటి సారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. తెలంగాణ ప్రాంతీయ ఆచార వ్యవహారాలను, సంస్కృతి సాంప్రదాయాలను, మానవ సంబంధాలు తెరపై చూపించిన తీరు చాలా మందిని ఆకట్టుకుంది. సినిమా ఆద్యంతం చాలా ఎంటర్ టైనింగ్‌గా సాగి చివర్లో ప్రతి ఒక్కరితో కన్నీరు పెట్టిస్తుంది. ఈ చిత్రాన్ని తెలంగాణ ప్రజానీకం ఓన్ చేసుకుంది. ఇది మా సినిమా, మా బతుకులను చూపించిన సినిమా అని ప్రతి ఒక్కరూ ఫీలయ్యారు. అందుకే ఊరూరా తెరలు కట్టి, రచ్చబండల వద్ద, గ్రామ పంచాయితీల వద్ద బలగం సినిమా ప్రదర్శించారు.
'బలగం మూవీకి ఏ కేటగిరీలో ఆ అవార్డు వచ్చింది'
బలగం మూవీ కేవలం తెలంగాణలోనే కాకుండా అటు ఆంధ్రలో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. దేశ విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. బలగం చిత్రానికి లెక్కలేనన్ని అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇదే అంశంపై తాజాగా జరిగిన కానిస్టేబుల్ రాత పరీక్షల్లో ఓ ప్రశ్న వచ్చింది. బలగం సినిమాకు ఒనిక్యో ఫిల్మ్ అవార్డుల్లో భాగంగా ఏ కేటగిరీలో అవార్డు వచ్చిందని క్వశ్చన్ అడిగారు. దానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ సంభాషణ అనే ఆప్షన్లు ఇచ్చారు. బలగం చిత్రానికి ఉత్తమ నాటకం అనే కేటగిరీలో ఒనిక్యో ఫిల్మ్ అవార్డు వరించింది. ఇలాంటి అవార్డులు బలగం సినిమాకు చాలా వచ్చాయి. తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమాగా వచ్చిన బలగం.. అటు కలెక్షన్లలో బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా, అవార్డులను కొల్లగొట్టడంలోనూ రికార్డులు క్రియేట్ చేస్తోంది.
'సంతోషంగా, గర్వంగా ఉంది'
తను మొదటి సారి మెగా ఫోన్ పట్టుకుని తెరకెక్కించిన బలగం సినిమా గురించి కానిస్టేబుల్ పరీక్షలో క్వశ్చన్ రావడంపై డైరెక్టర్ వేణు ఎల్దండి స్పందించాడు. 'ఓ ఫ్రెండ్ నాకు ఇది పంపించాడు. ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. బలగం సినిమాను ఆదరించిన, అక్కున చేర్చుకున్న తెలుగు సినీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరంతా నా కలను సాకారం చేశారు' అంటూ ట్వీట్ చేశాడు డైరెక్టర్ వేణు.