News
News
X

Breaking News Live Telugu Updates: ఓయూ లో ఉద్రిక్తత, పెట్రోల్ పోసుకొని కానిస్టేబుల్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
ఓయూలో ఉద్రిక్తత, పెట్రోల్ పోసుకొని కానిస్టేబుల్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం 

ఓయూలో ఉద్రిక్తత నెలకొంది. పెట్రోల్ పోసుకొని కానిస్టేబుల్ అభ్యర్థి  ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓసీ, బీసీ అభ్యర్థులకు కానిస్టేబుల్, ఎస్సై రాత పరీక్షల్లో  పాస్ పర్సంటేజ్ తగ్గించడంపై అభ్యర్థుల ఆందోళన చేపట్టారు. ఎస్టీ, ఎస్సీలకు కూడా క్వాలిఫై మార్కులు తగ్గించాలని అభ్యర్థుల డిమాండ్ చేస్తున్నారు. క్వాలిఫై మార్కులు తగ్గించాలంటూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వద్దకు ర్యాలీ నిర్వహించారు. 

ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలకు బ్రేక్, హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే 

Supreme Court : కర్ణాటక బెంగళూరు ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలు బ్రేక్ పండింది. గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్ 

Minister KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఇంట్లోనే ఐసోలేట్ అయినట్లు మంత్రి తెలిపారు. 

హైదరాబాద్ లో మరో వ్యక్తిపై పీడీ యాక్ట్ 

PD Act : మత విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న సయ్యద్ అబ్దుల్ ఖాద్రీ అలియాస్ కషఫ్ పై హైదరాబాద్ పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. అనంతరం కషఫ్ ను అరెస్టు చేశారు. ఓ వర్గంపై కషఫ్ ట్విట్టర్ లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  రాజాసింగ్ వీడియోను షేర్ చేసి మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి కషఫ్ ప్రయత్నించినట్లు చెప్పారు. కషఫ్ వ్యాఖ్యలతో పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. సీపీ ఆఫీసు ముందు ధర్నాలోనూ కషఫ్ కీలకపాత్ర వహించినట్లు తెలుస్తోంది.  

Nara Lokesh: రేణిగుంట ఎయిర్ పోర్టుకి నారా లోకేష్

రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో నారా లోకేష్ కి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా చిత్తూరు జిల్లా జైలుకు చేరుకుని టీడీపీ నాయకులను పరామర్శించనున్నారు.

KCR News: సెప్టెంబరు 3న టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం

సెప్టెంబర్ 3 వ తేదీ క్యాబినెట్ సమావేశం అనంతరం తెలంగాణ భవన్‌లో సాయంత్రం 5 గంటలకు టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాగే ఈ సమావేశంలో  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు, తదితర అంశాలపై, సమావేశంలో చర్చించనున్నారు.

Bhadradri Kothagudem: ఉప సర్పంచ్ హత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ హత్య

నిన్న అర్ధరాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న ఇర్ప రాములను అపహరించుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు

కుటుంబ సభ్యులు ప్రాధేయపడినా వదలకుండా ఊరు బయటకు తీసుకువెళ్లి హత్య చేసిన వ్యక్తులు

ఘటనా స్థలంలో ఇన్ ఫార్మర్ నెపంతో రాములను హత్య చేసినట్లు మావోయిస్టుల పేరుతో లేక వదిలి వెళ్ళిన దుండగులు

Narsingi ATM Fire: నార్సింగిలో మంటల్లో చిక్కుకున్న ఏటీఎం

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఏటీఎంలో మంటలు పూర్తిగా వ్యాపించడంతో పాటు ఏటీఎంలో ఉంచిన డబ్బులు కూడా దగ్ధమయ్యాయి. ఏటీఎంలో మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏటీఎంలో ఎంత నగదు ఉందో పరిశీలిస్తున్నారు.

ఇబ్రహీంపట్నం ఆసుపత్రి ఘటనలో 4కు చేరిన మరణాలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రిలో మరణాల సంఖ్య 4కు చేరింది. ఆగస్టు 25న 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా వీరిలో కొందరు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఇద్దరు మహిళలు ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి విషమించిన లావణ్య, మౌనిక అనే మహిళలు ప్రైవేటు ఆసుపత్రులో చికిత్స పొందుతూ నేడు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 4కు చేరింది.

Jagityal: జగిత్యాల జిల్లాలో కత్తులతో దాడి, 10 మందితో వచ్చి అన్నదమ్ములపై పోట్లు

జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పుడూరు గ్రామంలో నడిరోడ్డుపై యువకుడు కత్తితో వీరంగం సృష్టించాడు. తన గ్యాంగ్ తో వచ్చి ప్రత్యర్థులపై విచక్షణ రహితంగా దాడికి దిగాడు. గిడ్వాన్ అనే యువకుడు మరో 10 మంది యువకులతో వచ్చి భరత్, చరణ్ అనే ఇద్దరు అన్నదమ్ములపై కత్తులతో దాడి చేశాడు. భరత్ అనే యువకుడికి ఆరు కత్తి పోట్లు దిగాయి తీవ్రగాయాలు కాగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత పగలు దృష్టిలో ఉంచుకొని కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Background

Rains in Telangana AP: ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతంలో నుంచి ఏపీ దక్షిణ ప్రాంతం వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది క్రమంగా దక్షిణవైపు కదులుతోంది. ఉత్తర కర్ణాటక నుంచి కొమోరిస్ ప్రాంతం వరకు, దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ఉన్న సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో ఆగస్టు 31 వరకు వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ కేంద్రం.  

తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగస్టు 29న మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది.

నేడు (ఆగస్టు 30న) నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగరిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి మెదక్, కామారెడ్డి, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో అక్కడక్కడ వర్ష సూచన ఉంటడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. హైదరాబాద్ నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. వాయువ్యం, ఉత్తర దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ ప్రాంతాల్లో నేటి నుంచి మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడుతుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. 

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రకు మోస్తరు వర్ష సూచన ఉండగా.. రాయలసీమ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. చిత్తూరు, అనంపురం జిల్లాల్లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు అంచనా వేశారు. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి.

బంగారం, వెండి ధరలు

దేశవ్యాప్తంగా బంగారం ధర (Today's Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు కాస్త తగ్గింది. 10 గ్రాములకు దాదాపు రూ.150 తగ్గింది. కిలో వెండి ధర కూడా నేడు రూ.800 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మార్పులు కనిపించాయి. 

తెలంగాణలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Telangana)
22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ఇవాళ హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో రూ.47,150 గా ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.51,430 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.60,000 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో పసిడి ధర ‍(Gold Rate in Vijayawada) ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,150 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,430 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.60,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430 గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.60,000 గా ఉంది.