News
News
X

Breaking News Live Telugu Updates: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు ఉందని ఫోన్ కాల్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబు ఉందని ఫోన్ కాల్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మరోసారి కలకలం.  రైల్లో బాంబు ఉందంటూ కాల్ రావడంతో సెక్యూరిటీ సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు .  ఆగి ఉన్న బళ్లారి ఎక్స్ ప్రెస్ బాంబు ఉందని ఓ గుర్తు తెలియని ఆగంతుకుడు కాల్ చేశాడు. 

పార్వతిపురంలో రోడ్డు ప్రమాదం-ఐదుగురు మృతి

పార్వతిపురం మన్యం జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. కమరాడ దగ్గర ఆటోను లారీ ఢీ కొట్టిన దుర్ఘటనలో ఐదుగురు చనిపోయారు. వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. బాధిలంతా అంటివలసకు చెందినవారిగా గుర్తించారు. 

Chennai Earthquake: చెన్నైలోని అన్నానగర్‌లోనూ భూ ప్రకంపనలు

చెన్నైలోని అన్నానగర్ ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు సమాచారం అందడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చెన్నైలోని అన్నారోడ్‌ సమీపంలోని లాయిడ్స్‌ రోడ్డులో ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఉదయం 10.15 గంటల ప్రాంతంలో భవనం స్వల్పంగా కంపించడంతో ఉద్యోగులను ఖాళీ చేయించారు. అలాగే అన్నా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చినట్లు సమాచారం. చెన్నైలో జరుగుతున్న మెట్రో పనుల వల్లే భూకంపం వచ్చి ఉండొచ్చని కొంత మంది చెప్పగా, దాన్ని మెట్రో అధికారులు ఖండించారు.

భూకంపం సంభవించినట్లు చెబుతున్న ప్రాంతాల్లో మెట్రో పనులు జరగడం లేదని వివరించారు. ఇదిలా ఉండగా, చెన్నైలో భూకంపం వచ్చిన సమయంలోనే, శ్రీలంకలోని పుట్టాలంలో రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. 

Earthquake in Uttarakhand: ఉత్తరాఖండ్‌‌లో భూ ప్రకంపనలు

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో కూడా ప్రకంపనలు వచ్చాయి. భూకంపం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. టర్కీ, సిరియాలో వరుస భూకంపాల తర్వాత.. భారత్‌లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంభవించిన భూకంపంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీని గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Earthquake in India: దిల్లీలో కొన్ని చోట్ల భూ ప్రకంపనలు

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, హరియాణాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ సమీపంలో భూకంప కేంద్రం ఉంది.

నేపాల్‌లో కూడా భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఇక్కడ రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంప కేంద్రం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు తూర్పున 143 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు దాని లోతు భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది.

గత కొన్ని నెలలుగా నేపాల్‌లో తరచూ భూకంపాలు వస్తూనే ఉన్నాయి. అంతకుముందు జనవరి 24న నేపాల్‌లో 5.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. గతేడాది నవంబర్‌లో నేపాల్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Tirumala News: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎంపీ మాలోత్ కవిత., ఏపీ హోమ్ మినిస్టర్ టి వనిత, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్., వర్తమాన సినీ నటి సరోజాదేవి., సినీ నటుడు త్రిగున్లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా... ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసారు. ఆలయం వెలుపల తెలంగాణ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీగా అవతరించిన అనంతరం మొదటిసారి స్వామి వారి దర్శనార్థం వచ్చానని తెలిపారు. కేసీఆర్ పై స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నెంబర్ 1గా చేసారని, దేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ సేవలందించాలని ప్రార్ధించినట్లు తెలిపారు. పొత్తులపై అధినేతదే తుదినిర్ణయమని స్పష్టం చేశారు.

Vikarabad Girl Rape: వికారాబాద్ జిల్లాలో పదో తరగతి బాలికపై అత్యాచారం

వికారాబాద్ జిల్లా యాలాలలో పదో తరగతి విద్యార్థినిని రఘుపతి అనే యువకుడు కిడ్నాప్‌ చేసి, అత్యాచారం చేశాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని కారులో ఎత్తుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే, విహారయాత్ర కోసం స్కూల్‌ హెడ్‌మాస్టర్ వెంకటయ్య.. విద్యార్థులను హైదరాబాద్‌ కు తీసుకొచ్చారు. తిరిగి అర్ధరాత్రి సమయంలో విద్యార్థులు స్కూల్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు ఆమెను తీసుకెళ్లేందుకు స్కూలుకు రాకపోవడంతో హెడ్‌మాస్టార్.. రఘుపతి అనే వ్యక్తికి బాలికను అప్పగించి.. ఇంటిదగ్గర దిగబెట్టాలని సూచించారు. దీంతో రఘుపతి బాలికను కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. రెండు రోజుల తర్వాత తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు యాలాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు రఘుపతిని అరెస్టు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్ మాస్టర్‌ వెంకటయ్యను జిల్లా కలెక్టర్ సస్పెండ్‌ చేశారు.

Minister Harish Rao: మంత్రి హరీశ్ రావు ఆదిలాబాద్ పర్యటన రద్దు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి హరిష్ రావ్ పర్యటన రద్దు

యథావిధిగా కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 

మంత్రి హరిష్ రావు పర్యటన ఉందని ముందస్తుగా పలువురు ప్రతిపక్షాలు, ఆదివాసీ సంఘ నాయకుల అరెస్ట్

నిర్మల్ లో సిటీ స్కానింగ్ సేవలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Warangal Medical Student: వరంగల్‌లో వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

వరంగల్‌లో వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న ప్రీతి అనే విద్యార్థి సూసైడ్‌ ఎటెంప్ట్ చేయడం కలకలం రేపింది. తోటి విద్యార్థి సైఫ్‌ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు స్నేహితులు చెబుతున్నారు. 
‘‘ప్రీతి స్పృహలో లేదు. నిమ్స్‌కి తరలించారు. ఉదయం గుండె నొప్పి అని చెప్పింది. ప్రీతికి చాలా అవయవాలు పాడు అయ్యాయి’’ అని తోటి విద్యార్థులు చెప్పారు.

Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు వైఎస్‌ జగన్‌ వీడ్కోలు

గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌లో బుధవారం ఉదయం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీడ్కోలు పలికారు. గవర్నర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయన ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఏపీలో మూడున్నర ఏళ్ల పాటు గవర్నర్‌గా పని చేశారు. వీడ్కోలు కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, గవర్నర్ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా,ఎస్పీ జాషువా, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

Air India Flight: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు

అమెరికా నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. లోపాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని స్వీడన్‌‌లోని స్టాక్‌హోమ్‌ ఎయిర్ పోర్టులో అ‍త్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ కావడం వల్ల విమానాన్ని  స్వీడన్‌కు దారి మళ్లించారు. ఫ్లైట్‌లో మొత్తం 300 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే విమానంలో అందరూ సురక్షితంగానే ఉన్నారని, స్టాక్‌హోం విమానాశ్రయానికి ఫైర్ ఇంజిన్లకు కూడా తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయిల్ లీక్‌ కారణంగా విమానం రెండో ఇంజిన్ ఆగిపోయిందని, అందుకే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని డీజీసీఏ సీనియర్ అధికారి చెప్పారు. సమస్యను గుర్తించామని, ఇన్‌స్పెక్షన్ జరుగుతోందని పేర్కొన్నారు.

Girls Missing in Tirumalgiri: పుట్టినరోజు పార్టీకి వెళ్లిన బాలికలు, ఆ వెంటనే మిస్సింగ్

హైదరాబాద్ కార్ఖానా సమీపంలోని తిరుమలగిరిలో ముగ్గురు బాలికలు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. పుట్టిన రోజు వేడుకల కోసం అని, బయటకు వచ్చిన ముగ్గురు బాలికలు ఆ తరువాత కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9వ తరగతి చదువుతున్న మరియా అనే విద్యార్థి తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులైన హసీనా, సక్నలతో కలిసి పార్టీ చేసుకునేందుకు బయటకు వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ముగ్గురు బాలికలు రాత్రి అయినా ఇంటికి చేరలేదు. బాలికలకు తల్లిదండ్రులు ఫోన్లు చేయగా స్విచ్‌ ఆఫ్ వచ్చింది. దీంతో బాలికల మిస్సింగ్‌పై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలికల కోసం వెతుకుతున్నారు.

Background

పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వారు అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు. 

తెలంగాణలో క్రమంగా చలి తగ్గుతోంది. మొన్న మూడు జిల్లాలకు మాత్రమే ఎల్లో అలర్ట్ జారీ అవ్వగా.. నేడు రాష్ట్రమంతా సాధారణంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు అంచనా వేశారు. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.

హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.8 డిగ్రీలుగా నమోదైంది.

ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.

ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. 

ఎల్ నినో ఏర్పడే అవకాశాలు
‘‘ఫసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న పరిస్ధితుల వలన తేలికపాటి-ఎల్ నినో ఏర్పడే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తోంది. 2019 నుంచి ఇప్పటి వరకు లానినా దిశ ఉన్నా, ఇప్పుడు పరిస్ధితులు వెనక్కి మారనున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్ధితుల కంటే ఏప్రిల్ లో మరింత స్పష్టత రానుంది.

ఎల్-నినో అంటే తక్కువ వర్షాలు, లానినా అంటే అధిక వర్షాలు ఉండటం సహజం. దానితో పాటు హిందూ మహాసముద్రం (ఇండియన్ ఓషన్) లో జరిగే మార్పుల వలన కూడ వర్షపాతం మారుతుంది. కానీ దాని ప్రభావం అత్యల్పంగానే ఉంటుంది. కాబట్టి ఈ సారి ఎలా ఉండనుందో చూడాలి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.