TS New DGP : తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్ - బాధ్యతల స్వీకరణ !
తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరించారు. మహేందర్ రెడ్డి వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది.
TS New DGP : తెలంగాణ కొత్త డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీలు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకూ డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి ఈ రోజే పదవి విరమణ చేశారు. ఉదయం తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీలో మహేందర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 36 ఏళ్ల పాటు పోలీస్ డిపార్ట్ మెంట్ లో మహేందర్ రెడ్డి వివిధ హోదాల్లో సేవలు అందించారు.
I took charge as the Director General of Police, Telangana from Shri. M. Mahendar Reddy, IPS who was retiring from service on superannuation.
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) December 31, 2022
-Anjani Kumar, IPS. pic.twitter.com/6PhRQcb0K9
పలు కీలక బాధ్యతలు నిర్వహించిన అంజనీకుమార్
1992లో జనగామ ఏఎస్పీగా నియమితులైన అంజనీకుమార్ అంచెలంచెలుగా ఎదిగి డీజీపీ అయ్యారు. మహబూబ్‌నగర్ అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. 1998లో ఐక్యరాజ్యసమితికి డిప్యూటేషన్‌పై వెళ్లి బోస్నియాలో శాంతిదళాలతో కలిసి పనిచేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చి రెండు మెడళ్లు పొందారు. 2003 వరకు సీఐఎస్‌ఎఫ్‌లో పనిచేసి, అనంతరం రాష్ర్ట సర్వీసులకు వచ్చారు. 2005 నుంచి 2011 వరకు గుంటూరు, నిజామాబాద్ రేంజ్ డీఐజీగా, కౌంటర్ ఇంటెలిజెన్స్ డీఐజీగా, గ్రేహౌండ్స్ చీఫ్‌గా విధులు నిర్వర్తించారు. 2011-2012 మధ్యలో వరంగల్ ఐజీగా, 2012-2013 వరకు ఐజీ కమ్యూనికేషన్‌గా, 2018-2021 వరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా, అనంతరం ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. అక్కడ్నుంచి డీజీపీగా నియమితులయ్యారు.
నాలుగేళ్ల పాటు డీజీపీగా బాధ్యతలు నిర్వహించనున్న అంజనీకుమార్
డీజీపీగా నియమితులైన అంజనీకుమార్‌కు ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆయనకు ఇంకా నాలుగేళ్ల సర్వీసు ఉంది. అప్పటి వరకూ ఆయన తెలంగాణ డీజీపీగా బాధ్యతలు నిర్వహించే అవకాశం తెలిపారు. రాష్ట్రానికి కొత్త డీజీపీగా నియమితులైన అంజనీకుమార్కు డీజీపీ మహేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. అంజనీకుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్ శాఖ మరింత బలపడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు మహేందర్ రెడ్డి సందేశం
టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్నో కేసులు పరిష్కరించామని ..రానున్న రోజుల్లో నేరాలన్ని డిజిటల్ రూపంలో జరుగుతాయి కాబట్టి... పోలీసులందరూ టెక్నాలజీతో అప్డేట్ అవ్వాలని రిటైర్మెంట్ సందర్భంగా మహేందర్ రెడ్డి సూచించారు. విజనరీని దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేసిందని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
మహేందర్ రెడ్డికి త్వరలో కొత్త పదవి
పదవి విరమణ చేసిన మహేందర్ రెడ్డి కోసం ప్రభుత్వం మరో పోస్టును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఇటీవల ప్రారంభించిన TSPICCC ఛైర్మన్ పోస్టును ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్ హోదాలో నియమించనున్నట్లు సమాచారం. ఈ పదవి ఉన్నవారికి కేబినెట్ హోదా లభించనుంది. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడతాయని తెలుస్తోంది. ఈ పోస్టు కింద టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో విభాగాలు కూడా ఉంటాయని తెలిసింది.