(Source: ECI/ABP News/ABP Majha)
Heavy Rains in Telugu States: ముంచెత్తుతున్న ఈ వరదలకు కారణమేంటి? ఈ పాపం ఎవరిది?
ప్రస్తుతం భూములకు పెరిగిన ధరల నేపథ్యంలో సహజ సిద్ధంగా ఉన్న చెరువులు, కుంటలు కబ్జాలకు గురయ్యాయి. ఈ కారణంగా ప్రకృతి సహజ సిద్ధంగా వెళ్లాల్సిన వరద నీరు ఒకే చోట ఉండిపోతోంది.
ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వరదలకు రోజురోజుకీ పెరుగుతున్న పట్టణీకరణ ముసుగులో భవన నిర్మాణాల నిబంధనలకు నీళ్లు వదలడం.. ప్రకృతికి విరుద్దంగా చేస్తున్న కట్టడాలే కారణమా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఒకప్పుడు వర్షం వస్తే కేవలం బ్రిడ్జీలు లేని రహదారుల వల్లే గ్రామస్తులు బాధపడేవారు. కానీ ఇప్పుడు పట్టణంలోని ప్రతివీధి ఓ చిన్నపాటి కాలువలను తలపిస్తున్నాయి. కేవలం వర్షాలు వచ్చినప్పుడు ఆలోచిస్తున్న ప్రభుత్వం ఆ తర్వాత వాటిని వదిలేస్తుండటంతో భవిష్యత్‌లో ఇవి మరింత ప్రమాదకరంగా మారుతాయనేది మాత్రం నిర్వివాదమైన అంశం.
ఇందుకు తార్కాణమే గత రెండేళ్లుగా కురుస్తున్న వర్షాలకు పట్టణాల్లో జనజీవనం అస్తవ్యస్తం కావడం. గత ఏడాది కురిసిన వర్షానికి హైదరాబాద్‌లోని సింహభాగం అతలాకుతలం అయింది. ఈ ఏడాది కురిసిన వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం, పాల్వంచ, సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల తదితర పట్టణాలు నీటి కుంటలను తలపించాయి. ఇందుకు కారణాలేందో ఒకసారి విశ్లేషించుకుందాం.
గతంలో కూడా వర్షాలు విస్తారంగానే కురిసేవి. అయితే, అప్పుడు కేవలం నదులు, వాగులు పొంగి పొర్లి లోతట్టు ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు నీట మునిగేవి. ఇప్పుడు అందుకు బిన్నంగా పట్టణాలు నీటి ముంపునకు గురవుతున్నాయి. వర్షం వస్తే ఆ నీరు కొంత భాగం భూమిలో ఇంకిపోతుంది. అదే పనిగా వర్షం కురిస్తే వరద నీరు కుంటలు, చెరువులు, వాగుల్లోకి చేరి ఆ తర్వాత నదుల్లోకి వెళ్లేది. ఇదంతా ప్రకృతి సహజసిద్దంగా జరిగేది. అయితే, ఇప్పుడు పట్టణీకరణ పుణ్యమా అంతా నగరాలన్నీ కాంక్రీట్ మయంగా మారాయి. వర్షం పడితే చినుకు కూడా భూమిలో ఇంకకుండా ఒకేసారి వరద తాకిడి పెరగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
మరోవైపు, ప్రస్తుతం భూములకు పెరిగిన ధరల నేపథ్యంలో సహజ సిద్ధంగా ఉన్న చెరువులు, కుంటలు కబ్జాలకు గురయ్యాయి. ఈ కారణంగా ప్రకృతి సహజ సిద్ధంగా వెళ్లాల్సిన వరద నీరు ఒకే చోట ఉండిపోతోంది. కేవలం డ్రైనేజీలే వరద నీరు వెళ్లేందుకు మార్గాలు అవుతుండడటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి తోడు పట్టణాల్లో నానాటికీ మారుతున్న కాంక్రీట్ మయం కారణంగా నీరు భూమిలో ఇంకే పరిస్థితి కూడా లేకపోవడంతో వచ్చిన వర్షం మొత్తం ఒకేమారు వరద రూపంలో చుట్టు ముట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
పట్టణీకరణలో బాగంగా విలాసవంతమైన జీవితం కోసం చేస్తున్న తప్పిదాలు ఈ వరద ప్రభావానికి కారణమనే చెప్పవచ్చు. దీంతోపాటు రియల్‌ఎస్టేట్ పేరుతో సహజ సిద్ధంగా ఏర్పాటైన కుంటలు, చెరువులు అన్యాక్రాంతం అవుతుండటంతో వాన నీరు వెళ్లేందుకు ఉండే ప్రధాన మార్గాలు కనుమరుగు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఈ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేందుకు భావి తరాలకు మంచి మార్గాన్ని అందించేందుకు ప్రభుత్వం పని చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న భవన నిర్మాణ చట్టాలను పటిష్ఠంగా అమలు చేయడంతోపాటు ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలను యథాతథంగా ఉంచితే భవిష్యత్ వరదల ముప్పు నుంచి తప్పించుకొనే అవకాశం ఉంది.