Adilabad News : ఉట్నూర్ లో కారు బీభత్సం, గంజాయి మత్తులో డ్రైవర్!
Adilabad News : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో గంజాయి మత్తులో యువకుడు కారుతో బీభత్సం సృష్టించాడు. అతివేగంగా ప్రయాణిస్తూ రెండు బైక్ లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.
Adilabad News : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో కారు బీభత్సం సృష్టించింది. జైనూర్ మండలానికి చెందిన ఓ యువకుడు గంజాయి మత్తులో కారు నడుపుతూ ఉట్నూర్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఓ బైకుపై వెలుతున్న యువకుడిని ఢీకొని పరారయ్యాడు. ఆ తర్వాత ఫులాజీ బాబా డిగ్రీ కాలేజీ ముందు మరో బైక్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకుపై వెలుతున్న తండ్రీ కొడుకులు పైకి ఎగిరి కిందబడ్డారు. తండ్రికి తీవ్ర గాయాలు కాగా, చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. అంబేడ్కర్ చౌరస్తాలో గాయపడ్డ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కారుతో బీభత్సం సృష్టించిన యువకుడిని అక్కడి జనం పట్టుకున్నారు. అతడికి దేహశుద్ది చేశారు. అక్కడే ఉన్న పోలీసులు అది గమనించి ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని ఉట్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కారు నడుపుతున్న యువకుడు గంజాయి మత్తులో ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తు్న్నారు.
అతి వేగం ప్రాణం తీసింది!
బంధువుల ఇంటికని కర్ణాటక నుంచి హైదరాబాద్ కు వచ్చారు. అలా భాగ్య నగర అందాలను చూసొద్దామని బండిపై బయలు దేరారు ఓ ఇద్దరు యువకులు. ఎలాంటి భయం లేకుండా అతి వేగంలతో వాహనాన్ని నడిపారు. అదే వారి పాలిట శాపంగా మారింది. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారు ఇక్కడ ప్రాణాలు కోల్పోయేలా చేసింది. అతివేగం అంత మంచిది కాదని ట్రాఫిక్ పోలీసులు ఎంతగా చెప్తున్నా వినరు. ఇలా ప్రాణాలు పోగొట్టుకొని వాళ్లని నమ్ముకొని బతుకుతున్న వాళ్లకు నరకం చూపిస్తారు. ఈ ఘటనలోనూ ఇదే జరిగింది.
పాతికేళ్లు కూడా నిండకముందే
పంజాగుట్ట ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల మోహిన్, 22 సంవత్సరాల ఒబేద్ ఎర్రమంజిల్ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో సోమాజిగూడ హనుమాన్ దేవాలయం ఎదురుగా ఉన్న మెట్రో పిల్లర్ ను ఢీకొట్టారు. ఒక్కసారిగా కిందపడిపోయిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడచారు. అయితే విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే మోహిన్, ఒబేద్ లు కర్ణాటక నుంచి హైదరాబాద్ లో ఉన్న బందువుల ఇంటికి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుల బంధువులకు సమాచారం అందించామని.. వారు వస్తే తప్పు వీరికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే వీరి ప్రమాదానికి కారణం అని పోలీసులు గుర్తించారు. అతివేగం వద్దని ఎంత చెప్తున్నా చాలా మంది యువకులు వినకుండా వాళ్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని పోలీసులు వివరించారు.