Adilabad News: గొలుసు మింగిన 7 నెలల చిన్నారి - బయటకు తీసి ప్రాణాలు కాపాడిన వైద్యులు
Telangana News: ఆదిలాబాద్ జిల్లాలో 7 నెలల చిన్నారి గొలుసు మింగేయడంతో గొంతులో ఇరుక్కుని ఇబ్బందులు పడింది. వెంటనే రిమ్స్ తరలించగా.. వైద్యులు ఎండోస్కోపి చేసి చిన్నారిని రక్షించారు.
7 Months Old Child Swallowed Chain In Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad District) 7 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు కాలిపట్టి గొలుసు మింగేసింది. ఈ క్రమంలో గొంతులో ఇరుక్కుని ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కొంది. వైద్యులు చిన్నారికి చికిత్స చేసి గొలుసును బయటకు తీశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్‌కు చెందిన సత్యపాల్ కూతురు ధ్రుతి (7 నెలలు) కాలికి ఉన్న వెండి పట్టగొలుసును నొట్లో పెట్టుకోవడంతో గొంతులో ఇరుక్కుపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని వెంటనే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ (Adilabad Rims) ఆస్పత్రికి తరలించారు.
రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ మామిడి హేమంతరావ్ చాకచక్యంగా ఎండోస్కోపీ చేసి చిన్నారి గొంతులో ఇరుక్కున్న గొలుసును బయటకు తీశారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారి ప్రాణాలు కాపాడిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ సైతం చిన్నారి ప్రాణాలు కాపాడిన వైద్యుడు హేమంత రావును అభినందించారు. చిన్నారులకు ఆభరణాలు వేసినప్పుడు వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, వారి చేతిలో ఏదైనా వేస్తే అది నోట్లో పెట్టుకుని గొంతులు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది కావున ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు సైతం చిన్నారుల పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలని పలువురు కోరుతున్నారు.
Also Read: Hyderabad: తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు - ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు